సాక్షి,బళ్లారి: నాడు సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న అసమానతలు, కులవివక్షపై పోరాటం చేయడంతో పాటు ఆధ్యాత్మిక, భక్తిమార్గంలో పయనిస్తూ, శివభక్తిని జనంలో పెంపొందించడానికి దేవర దాసిమయ్య ఎంతో కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం దేవర దాసిమయ్య జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం రోడ్డులోని కల్చరల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతిని నగర మేయర్ గాదెప్ప, లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అవ్వార మంజునాథ తదితరులు పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. చేనేత సమాజంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లా నేకార సంఘం అధ్యక్షుడు దేవానంద, నేకార సమాజ ప్రముఖులు ఎల్‌ఐసీ రాజు, చంద్రశేఖర్, ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ పన్నారాజ్, మాజీ కార్పొరేటర్ సుధాకర్ దేశాయి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
విజయనగరలో..
హొసపేటె: నగరంలోని నీలకంఠ దేవస్థానంలో తాలూకా నేకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం దేవర దాసిమయ్య జయంతిని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు హంపీ నుంచి జ్యోతిని తెచ్చారు. ఈ వేడుకల్లో దేవర దాసిమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 12వ శతాబ్దపు సన్యాసి, వచన రచయిత, బసవేశ్వరుని సీనియర్ సమకాలీకుడైన దేవర దాసిమయ్య సమానత్వం, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి రాసిన 176 వచనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమాజ ప్రముఖులు కాశీ విశ్వనాథ్, విజయకుమార్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో దేవర దాసిమయ్య జయంతిని ఆచరించారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జయంతిని పురస్కరించుకుని దేవర దాసిమయ్య చిత్రపటానికి తహసీల్దార్ సురేష్ వర్మ పూలమాలలు వేశారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జ్యోతి వెలిగించి ఏడీసీ శివానంద, సమాజం అధ్యక్షులు, ఇతరులున్నారు.
కులవివక్ష, అసమానతలపై పోరాటం
వచనాలు, బోధనలతో జనానికి చైతన్యం
జయంత్యుత్సవంలో పలువురు వక్తలు


