వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలి | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలి

Mar 24 2026 7:07 AM | Updated on Mar 24 2026 7:07 AM

సాక్షి,బళ్లారి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని తన నివాస గృహ కార్యాలయంలో బీజేపీ నూతన కార్యవర్గం ఎంపిక, నియామక పత్రాలను సంబంధితులకు అందజేసి మాట్లాడారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులు కట్టబెడతామన్నారు. పార్టీ కోసం ఎవరెంత పని చేశారన్నది ప్రతి ఒక్కరి చిట్టా పార్టీ పెద్దల వద్ద ఉంటుందన్నారు. సామాన్య వ్యక్తిని సైతం అందలం ఎక్కించే పార్టీ బీజేపీ అన్నారు. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్న పదాధికారులు నగరంలో బూత్‌ స్థాయి నుంచి ప్రతి వార్డులో పార్టీని బలపరచాలన్నారు.

సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చాలి

కేంద్రంలో బీజేపీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. పార్టీలో పదవులు తీసుకున్న వారు ఆయా వార్డులు, బూత్‌ల్లో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పెంచాలన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమష్టిగా ముందుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాటుపడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై జనం విసిగిపోతున్నారన్నారు. మాజీ మేయర్‌, నగర బీజేపీ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీని మరింతగా బలోపేతం చేయాలి

మాజీ ఎమ్మెల్యే

గాలి సోమశేఖరరెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement