మైసూరు: నేటి వేగవంతమైన జీవితం వల్ల కలిగే ఒత్తిడిని నివారించడానికి యోగా సహాయపడుతుందని, నెమ్మదైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వక్తలు పేర్కొన్నారు. జిల్లాలోని నంజనగూడులో దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీకంఠేశ్వర ఆలయం ముందు ఆదివారం గరళ్‌పురి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మందితో సామూహిక యోగాభ్యాసం జరిగింది. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు గొప్ప ఓర్పును యోగా ఇస్తుందని, నిత్యం యోగా సాధన చేయాలని గురువులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధృవ నారాయణ పాల్గొన్నారు. నంజనగూడును యోగా నగరంగా తీర్చిదిద్దడమే తమ ఆశయమన్నారు. మహాశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడని, అందుకు గుర్తుకు శ్రీకంఠేశ్వరుని సన్నిధిలో గరళ్‌పురి ఉత్సవాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు స్వామీజీలు, ప్రముఖులు పాల్గొన్నారు.
నంజనగూడులో గరళ్‌పురి ఉత్సవాలు


