యాదగిరి జిల్లాలో కుల వివక్ష | - | Sakshi
Sakshi News home page

యాదగిరి జిల్లాలో కుల వివక్ష

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

దేవాలయం మెట్లపై కూర్చున్నందుకు దళిత యువకులపై దాడి

సాక్షి, బళ్లారి: సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతోంది. తాజాగా యాదగిరి జిల్లాలో దేవాలయం మెట్లపై కూర్చున్న ఇద్దరు దళిత యువకులపై దాడి జరిగింది. యాదగిరి జిల్లా గురమిటకల్‌ తాలూకా యంపాడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యంపాడ గ్రామంలో శుభకార్యం నిమిత్తం విచ్చేసిన అనిల్‌ కుమార్‌, సిద్ధలింగప్ప అనే ఇద్దరు దళిత యువకులు ఎండవేడిమి తట్టుకోలేక సమీపంలో దేవాలయం మెట్లపై కూర్చొన్నారు. అదే సమయంలో దేవాలయ పూజారి అక్కడ ఎందుకు కూర్చొన్నారని వాదించాడు. అనంతరం పక్కనే ఉన్న కొందరు యువకులు కలగచేసుకుని పూజారితో కలిసి దళిత యువకులపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువకులను చికిత్స నిమిత్తం యాదగిరి ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సాహిత్యంపై ఆసక్తి పెంచుకోండి

హొసపేటె: ఆధునిక పరిజ్ఞాన యుగంలో నేటి యువత సాహిత్య రంగాలపై ఆసక్తి చూపించాలి. సాహిత్య రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత జోగతి మంజమ్మ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నూర్‌ జహాన్‌ షష్టి పూర్తి కార్యక్రమం సందర్భంగా సండూర్‌ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో ఆశా ప్రకాశన్‌–సిద్ధలింగప్ప చౌకి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం నిర్వహించారు. పాఠకులను ఆకట్టుకునే పుస్తకాలకు సమాజంలో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఉత్తమ పుస్తకాలు నిరంతరం వెలుగులోకి రావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నిష్టి రుద్రప్ప, రచయితలు డాక్టర్‌ ముంతాజ్‌బేగం, సుధా, చిదానంద గౌడ వెంకమ్మ చంద్రశేఖరయ్య రొనద మఠ్‌, షేక్షావలి మణిగర్‌, యత్నల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఉల్లాసంగా క్రీడా పోటీలు

బళ్లారి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బళ్లారి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు సంఘం జిల్లా అధ్యక్షుడు నెలకుంద్రి సదానంద మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో ఉద్యోగులు వివిధ రకాల ఒత్తిళ్లు, సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారన్నారు. నేపథ్యంలో ఆడ విడుపుగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటు ఉద్యోగ నిర్వహణ, అటు కుటుంబ బాధ్యతలు రెండింటిలోనూ మహిళలు రాణిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పలువురు మహిళలు పోటీల్లో ఉల్లాసంగా పాల్గొని అందరికి స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రముఖులు తిప్పారెడ్డి, హనుమంతరాయ సురేష్‌ కుమార్‌, ఎంటి మల్లేశ్‌, రాజశేఖర గాణిగెర, రామకృష్ణ, విజయ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఏడు శాతం

రిజర్వేషన్‌ కల్పించాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం నాయక్‌లకు ఏడు శాతం రిజర్వేషన్‌ కల్పించిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని కర్ణాటక వాల్మీకి మహర్శి నాయక్‌ పోరాట ఐక్యవేదిక మహాసభ సంచాలకుడు వి.ఎస్‌.ఉగ్రప్ప పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నాయక్‌లకు 7 శాతం రిజర్వేషన్‌ కేటాయింపు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపకుండా కాలయాపన చేయడం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్‌ వెంటనే అఖిలపక్ష నాయకులతో, ప్రధానమంత్రితో చర్చించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నాయక్‌ సమాజంపై మౌనం వహిహించడం తగదన్నారు. సమావేశంలో వరదానేశ్వర స్వామి, సంజయ్‌ కుమార, రాజశేఖర్‌ నాయక్‌, రఘవీర్‌ నాయక్‌, వెంకటేష్‌ నాయక్‌, రాజప్ప, హనుమంతరాయ, రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement