సాక్షి, బళ్లారి: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. రెండు రోజులుగా జిల్లాలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో సిరుగుప్ప తాలూకాలోని వివిధ గ్రామాల్లో వరి పంట నేలవాలింది. వరి కోతలు ప్రారంభమయ్యే క్రమంలో గింజలు నేలరాలడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్ రైతులు, అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు తమ బాధలను అధికారులకు చెప్పుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానతో పూర్తిగా నష్టపోయామని తెలిపారు. ఒక ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టగా.. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ.. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారుల బృందం సందర్శిస్తుందన్నారు. పూర్తిగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని పేర్కొన్నారు. రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తామని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.


