రాయచూరు రూరల్: కురవకల దత్తాత్రేయ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ అధికారులకు సూచించారు. శుక్రవారం రాయచూరు తాలుకా కురవకల గ్రామంలోని దత్తాత్రేయ దేవాలయాన్ని సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం చిన్న వంతెన నిర్మాణం, మూడు ఎకరాల్లో బస్టాండ్, పార్కింగ్ సౌలభ్యం, స్నానపు గదులు, శౌచాలయాలు, 50 గదులు, అన్న దాసోహ మంటపం, యాత్రికుల నివాసం నిర్మించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నితీష్, అసిస్టెంట్ కమిషనర్ హుంపన్న, శ్రీనివాస రెడ్డి, సూగప్ప తదితరులు పాల్గొన్నారు.
బంగారు ఆభరణాల చోరీ
హుబ్లీ: స్థానిక ల్యామింగ్‌టన్ రోడ్డులోని కనిష్క జువెలరీ షాప్‌లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ షాపులో పని చేస్తున్న సేల్స్ గర్ల్ మేరీ కట్టారి రూ.5.60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు హుబ్లీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి పని చేస్తున్న మేరీ.. షాపులో 49.11 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసింది. వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టి పరారీ అయినట్లు చెబుతున్నారు.
శ్రీశైలం భక్తులకు
ఉచిత భోజనం
రాయచూరు రూరల్: శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చిన కళ్యాణ, ఉత్తర కర్ణాటక భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం బైపాస్ రహదారిలోని ముగుల్ కోడ్ ముక్తి మందిర్ మైదానంలో వీరశైవ సమాజం, బసవ సమితి ఆధ్వర్యంలో శాంతమల్ల శివాచార్యులు, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ తదితరులు భక్తులకు భోజనం పెట్టారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటిల్, జయంతిరావ్ పతంగి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు ఖైదీల విడుదల
రాయచూరు రూరల్: సత్ప్రవర్తన కనబరిచినందుకు కలబుర్గి (గుల్బర్గా) సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు జీవిత ఖైదీలను (ఒక మహిళతో సహా) ముందస్తుగా విడుదల చేశారు. కర్ణాటక వ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. శుక్రవారం కలబుర్గి జైలు నుంచి సత్ప్రవర్తన కలిగిన పద్మ, సుబ్బణ్ణను జిల్లా కేంద్రౖ జెళ్ల సుదారణ సేవ పోలీస్ ఐజీపీ ఆదేశాల మేరకు విడుల చేశారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర జైళ్ల సుదారణ సేవ జైలర్ రాకేష్, ఉప జైలర్ సురేష్, చెన్నప్ప, సాగర్ పాటిల్, శ్రీ మంతగౌడ తదితరులు పాల్గొన్నారు.
ప్యాసింజర్ రైలు నడపాలి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రజల సౌకర్యార్థం బెంగళూరు–కలబుర్గి పాస్ట్ ప్యాసింజర్ రైలు నడపాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేశారు. శుక్రవారం లోకసభ సభ్యుడు కుమార నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాయచూరు మక్తల్ నుంచి కాచిగూడ వరకు నడపడానికి చర్యలు తీసుకోవాలని సూర్యదేవర నాగేశ్వరావు కోరారు. రాయచూరు రైల్వేస్టేషన్‌లో కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాయచూరు–గిణిగెర రైల్వే పనులు చేపట్టాలని సూచించారు. మమదాపూర్‌న్ గ్రేటర్ రైల్వేగా మార్చి గూడ్స్ షెడ్‌ను స్థాపించాలన్నారు. కుర్డిని రైల్వే క్రాసింగ్ స్టేషన్‌గా గుర్తించాలని విన్నవించారు. అనంతరం ఎంపీ కుమార నాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో రమేష్ బోస్, ప్రసాద్, కొండయ్య, అనంద్ తదితరులు పాల్గొన్నారు.


