హుబ్లీ: పదేళ్ల బాలుడిపై సొంత తల్లి దాడి చేసి గాయపరిచిన ఘటన ధార్వాడ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రామ నగర నివాసి లక్ష్మిపై బాలల సహయవాణి నిర్వహకులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ సదరు బాలుడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లిన క్రమంలో బాలుడి శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించడంతో సఖి వన్ స్టాప్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ కేంద్రం బాలల సహాయవాణికి సమాచారం ఇచ్చింది. మెరుగైన చికిత్స కోసం బాలుడిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా బాలల రక్షణ అధికారిణి దీపా జావురు మీడియాకు తెలిపారు. కాగా భార్యాభర్తల మధ్య కలహాలతో తల్లి తన బిడ్డపై దాడి చేసిందని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.
రంజాన్‌కు పటిష్ట బందోబస్తు
హొసపేటె: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం విజయనగర జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ జాహ్నవి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయనగర జిల్లాలోని 60 ఈద్గా మైదానాల్లో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయన్నారు. ఒక ఎస్పీ, 3 మంది డీవైఎస్‌పీలు, 14 మంది పీఐలు, 30 మంది పీఎస్‌లు, 600 మంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 300 మంది హోంగార్డు సిబ్బందితో కూడిన పోలీసు బలగాలను మోహరించామన్నారు. అదనంగా 112 వాహనాల ద్వారా గస్తీ చేపడుతామని వెల్లడించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో డీఏఆర్, కేఎస్‌ఆర్‌పీ బృందాలను కూడా మోహరించామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుండా నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
గంగమ్మదేవి విగ్రహం అందజేత
శ్రీనివాసపురం: తాలూకాలోని బల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ దేవాలయానికి కృష్ణశిలతో తయారు చేసిన గంగమ్మ దేవి విగ్రహాన్ని డాక్టర్ దేవిశ్రీ గురూజీ ప్రదానం చేశారు. త్వరగా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని గ్రామస్తులకు సూచించారు. ప్రతి గ్రామంలోను గ్రామ దేవతల పూజలు నిత్యం జరుగుతూ ఉంటే గ్రామం ప్రశాంతంగా సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.
ముస్లింలకు కిట్లు అందజేత
కేజీఎఫ్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే రూపా శశిధర్ ముస్లిం సముదాయానికి చేసింది శూన్యమని ఆర్‌కే ఫౌండేషన్ అధ్యక్షుడు మోహనకృష్ణ ఆరోపించారు. రంజాన్‌ను పురస్కరించుకొని శుక్రవారం ఆయన నగరంలో 400 మంది ముస్లిం కుటుంబాలకు నిత్యావసర పదార్థాల కిట్‌లను అందించి మాట్లాడారు. ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటోందన్నారు.
ఆలయాల్లో పంచాంగ శ్రవణం
శ్రీనివాసపురం: ఉగాది సందర్భంగా ముళబాగిలు నగరంలోని పురణా ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో పరాభవ నామ పంచాంగ పఠన కార్యక్రమాన్ని శ్రీ కాశి నాథశాస్త్రి నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్ నిర్వహించారు. వివిధ రాశుల వారికి కలుగుతున్న యోగాలను వివరించి తెలిపారు. నగరంలోని వేంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి, వరదరాజ స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భూ మాఫియాపై ఫిర్యాదు
కోలారు: ముళబాగిలు తాలూకా దేవరాయ సముద్ర సర్వేనెంబర్ 117లో 2 ఎకరాల 17 గుంట్ల భూమిని సకిలీ దాఖలాలు సృష్టించి కబ్జా చేశారని రైతు సంఘం పదాధికారులు ఆర్‌ఐ సుబ్రమణికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అధకారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి నకిలీ దాఖలాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను భూ మాఫియా చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


