మే నెలాఖరులోపు టీబీ డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మే నెలాఖరులోపు టీబీ డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తి

Mar 21 2026 5:12 AM | Updated on Mar 21 2026 5:12 AM

హొసపేటె: మే నెలాఖరులోపు టీబీ డ్యాం గేట్ల ఏర్పాటు పూర్తవుతాయని చిన్న నీటిపారుదల, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు స్పష్టం చేశారు. శుక్రవారం తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాలను సందర్శించారు. సాంకేతిక బృందం చేపడుతున్న క్రస్ట్‌ గేట్‌ ఏర్పాటు పనులను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తుంగభద్ర జలాశయానికి చెందిన 18 కొత్త క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. మరో 5 క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 23 గేట్ల పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి అవుతాయని అంచనా వేశారు. నిపుణుల బృందం, చీఫ్‌ ఇంజనీర్‌ చెప్పిన ప్రకారం గేట్లు మార్చే సమయంలో పాత డ్యామ్‌ నిర్మాణంలో ఎలాంటి సమస్య తలెత్తలేదన్నారు. మిగిలిన 10 గేట్లను ఏప్రిల్‌లో ఏర్పాటు చేస్తారని.. మొత్తం 33 కొత్త క్రస్ట్‌ గేట్ల ఏర్పాటు మే నెలాఖరు నాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్‌లో ప్రారంభమయ్యే వర్షాకాలం నాటికి జలాశయం పూర్తిగా సిద్ధం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో పూడిక సమస్యకు పరిష్కారంగా నావళి ప్రాజెక్టు ప్రతిపాదనకు బోర్డుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని వెల్లడించారు. ఈ సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యాక పూర్తి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మన రాష్ట్రానికి చెందిన వివిధ ఎన్నికై న ప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల ఎంపీలతో చర్చలు జరిపిందన్నారు. కర్ణాటక నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి, అధికారులు సానుకూలంగా స్పందించారని.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రక్రియలు ముగిశాక మరో విడత సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డు చైర్మన్‌, మాస్కి ఎమ్మెల్యే బసవన గౌడ తురువిహాల్‌, కొప్పల్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ కెప్టెన్‌ మహేష్‌ మలగిట్టి, అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మంజునాథ్‌, కొప్పల్‌ అదనపు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్‌.హేమంత్‌ కుమార్‌, టీబీ బోర్డు, కేఎన్‌ఎన్‌ఎల్‌ అధికారులు చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ మల్లిగివాడ, ఏఈఈ ధర్మరాజ్‌, జ్ఞానేశ్వర్‌, సెక్షన్‌ ఆఫీసర్లు జి.కిరణ, పంపపాటి డీకే.హులిరాజ్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement