ఈసారైనా నిర్మలమ్మ వరాలు దక్కేనా?
హుబ్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌పై జంట నగరాలతో పాటు జిల్లా ప్రజలు ముఖ్యంగా వెనుక బడిన ఉత్తర కర్ణాటక వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి నిర్మలమ్మ ప్రతిపాదించే బడ్జెట్ తమ ఉత్తర కర్ణాటక ఆశలు నెరవేరేలా ఉండాలని కోరుకుంటున్నారు. తాజా బడ్జెట్‌లో పారిశ్రామిక వాడల అభివృద్ధి, కొత్త కార్కానాల స్థాపన, జీఎస్‌టీ ఆదాయం, పన్నుల్లో మినహాయింపు, సాగు ఆధారిత పరిశ్రమలకు ఉత్తేజాన్ని ఇవ్వడం, హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అలాగే రైల్వే అభివృద్ధిపై ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నత్తనడకన సాగుతున్న ప్రముఖ చెన్నమ్మ సర్కిల్‌పై వంతెన నిర్మాణ పనుల వేగవంతం, కొత్త రైల్వే కనెక్షన్ పథకాలు, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ స్థాపన, పారిశ్రామికవాడలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వైపు చూస్తున్నారు.
ఎక్కువ నిధుల కోసం ఎదురు చూపులు
రోజురోజుకు పెరుగుతున్న జంట నగరాల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ నిధులను ఆశిస్తున్నారు. పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార వ్యవహారాలకు నగర సౌందరీకరణ, ఇతర వసతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా చెన్నమ్మ సర్కిల్ ఫ్‌లై ఓవర్ పనులను మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన ఎయిమ్స్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఉత్తర కర్ణాటక సింహ ద్వారం హుబ్లీ ధార్వాడ కావడంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త ఉద్యోగాల సృష్టిపై ఈ బడ్జెట్‌లో ఆశలు పెట్టుకున్నారు. అలాగే అత్యంత వెనుకబడిన కళ్యాణ కర్ణాటకతో పాటు కిత్తూరు కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న, పెండింగ్‌లో ఉన్న వివిధ రైల్వే పథకాలకు తగిన ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తున్నారు.
రైల్వే పథకాలకు మోక్షం లభించేనా?
హుబ్లీ– అంకోలా, తాళగుప్ప– హుబ్లీ కొత్త రైలు మార్గం కోసం నిధులు, అలాగే అస్తిత్వంలో ఉన్న రైల్వే వసతుల మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు ఎక్కువ నిధులు ఇవ్వాలని ఆశిస్తున్నారు. వివిధ సమస్యల పై హుబ్లీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అధ్యక్షుడు డీకే.ఆదప్పగౌడర మాట్లాడుతూ ఇప్పటికే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వివిధ సమస్యలు, డిమాండ్ల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో పరిశ్రమల ప్రగతి కరువైందన్నారు. పరిశ్రమల అభ్యున్నతి కోసం కనీస ధరల్లో భూమి సమకూర్చడంతోపాటు వివిధ మినహాయింపుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో కూడా వెనుకబడి ఉన్నామన్నారు. సాగు ఆధారిత పరిశ్రమలకు తగు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రైతన్నల పంటలకు తగిన గిట్టుబాటు ధర సకాలంలో ప్రకటించాలన్నారు.
రైతులకు ఎక్కువ రాయితీలివ్వాలి
పంట నష్ట పోయిన రైతన్నలకు సకాలంలోనే పరిహార ధనం అందేలా చూడాలన్నారు. మరికొన్ని సమస్యలను వివరిస్తూ ద్రాక్ష, మామిడి, గోడంబి సంరక్షణ యూనిట్లు ఉత్తర కర్ణాటక భాగంలో లేవు. వీటి సంస్కరణ యూనిట్లు స్థాపించే వారికి ఎక్కువ రాయితీని ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతంలో బళ్లారి, బ్యాడగి మినహా ఎక్కడా కూడా గార్మెంట్ ఫ్యాక్టరీలు లేవు. ఈ ఫ్యాక్టరీల స్థాపనకు ముందుకు వచ్చే వారికి భూమి, ఇతర సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. ఆ మేరకు కొత్త టెక్స్‌టైల్ విధానాన్ని ప్రకటించి పత్తి మిల్లులకు పునశ్చేతనం కల్పించాలన్నారు. దీంతో ఉపాధి పెరిగి నిరుద్యోగ నిర్మూలన సాధ్య పడుతుందన్నారు. మొత్తం మీద జిల్లా ప్రజలు ఉత్తర కర్ణాటక వెనుకబడిన ప్రాంతాల వారు నిర్మలమ్మ ప్రతిపాదించే బడ్జెట్‌పై ఈసారి ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.
ఆర్థిక బడ్జెట్‌పై ఉ–క వాసుల కోటి ఆశలు
ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వైపు కన్ను


