చెరువుల్లో నీరు నింపండి
రాయచూరు రూరల్: రబీ సీజన్‌లో క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో తుంగభద్ర ఎడమ, నారాయణపుర డ్యాం కుడి కాలువల్లో ప్రస్తుతం నీరు ప్రవహిస్తున్నందున జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చెరువుల్లో నీరు నింపాలని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ అధికారులకు సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. త్వరలో వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామీణ, నగర ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. వేసవిలో మూడు నెలలకు సరిపడా నీటిని చెరువుల్లో నిల్వ చేసుకోవా లని ఆదేశించారు. మూడు నెలల పాటు ఎండలు అధికంగా ఉంటాయన్నారు. మాన్వి, రాయచూరు, సింధనూరు, లింగసూగూరు, దేవదుర్గ, సిరవార తాలూకాల తహసీల్దార్లు, పీడీఓలు, రెవెన్యూ అధికారులు చెరువుల్లో నీటిని నింపడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి పైపులు పగలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు.


