బీదర్‌లో బ్యానర్ గొడవ
రాయచూరు రూరల్: బళ్లారి బ్యానర్ ఘటన మరువక ముందే గురువారం సాయంత్రం బీదర్‌లో బ్యానర్ గొడవ జరిగింది. వివరాలు.. రిపబ్లిక్ డే సందర్భంగా దళితులు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఫొటోలతో బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఉండటంతో మైనార్టీలు మంత్రి రహింఖాన్ ఫొటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్‌ను.. అంబేడ్కర్ బ్యానర్ కనపడకుండా అడ్డుగా కట్టేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఫొటోలతో ఏర్పాటు చేసిన బ్యానర్‌కు అడ్డుగా మంత్రి రహింఖాన్ ఫొటోలతో బ్యానర్ కట్టడంతో వాగ్వాదానికి దిగారు. వెంటనే మంత్రి రహీంఖాన్ బ్యానర్‌ను తొలగించారు. కాగా.. మంత్రి రహీంఖాన్ ప్రతిసారి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ అంటే మంత్రికి గౌరవం లేదన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం లేదని అసహనం వ్యక్తం చేశారు.


