ఆగని రేషన్ బియ్యం రవాణా
సాక్షి బళ్లారి: నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ డీలర్లు, పౌరసరఫరా శాఖ అధికారులు కుమ్మౖక్కై ఈ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి పౌరసరఫరా శాఖ అధికారులు, పోలీసులు అక్రమ బియ్యం సరఫరాను అడ్డుకోవాల్సి ఉండగా.. వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక రేషన్‌షాపు డీలర్లు అయితే ఏకంగా రేషన్‌షాపుల వద్దనే నేరుగా కిలో బియ్యాన్ని రూ.10లకే కొనుగోలు చేసి, తమకు వస్తున్న బియ్యంలో ప్రతి నెలా వందలాది బస్తాలను అక్రమంగా అమ్ముకుంటున్నారు. బీపీఎల్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందిస్తున్న నేపథ్యంలో సగానికి సగం మంది రేషన్‌కార్డులు ఉన్న వారు అమ్ముకోవడం రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
యాదగిరి జిల్లాలో అధికం
యాదగిరి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటక పరిధిలో బాగల్‌కోట, గదగ్, కొప్పళ, బీదర్, హుబ్లీ–ధార్వాడ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రతి నెలా రేషన్ బియ్యం రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రణ చేయకపోవడంతో యథేచ్ఛగా బియ్యం దందా కొనసాగుతోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని పాలిష్ చేసి సోనా మసూర బియ్యం తరహాలో తయారు చేస్తున్నారు. కిలో రూ.60 నుంచి రూ.70 చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇక గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని ఉత్తర కర్ణాటక నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.
260 క్వింటాళ్ల బియ్యం సీజ్
నగరంలోని సంగం సర్కిల్ సమీపంలోని పుల్లయ్య కాంపౌండ్‌లో శుక్రవారం తెల్లవారుజామున చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి రేషన్ బియ్యాన్ని మార్చి ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బళ్లారి అసిస్టెంట్ కమిషన్ రాజేష్ ఆధ్వర్యంలో దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బళ్లారి జిల్లా నుంచి గుజరాత్‌కు తరలిస్తున్న 523 బస్తాల రేషన్ బియ్యాన్ని (సుమారు 260 క్వింటాళ్లు) స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సీజ్ చేసి, ఐదుగురు హమాలీలను అరెస్ట్ చేశారు. రాత్రిళ్లు బియ్యం సరఫరాకు ఎందుకు వచ్చారని బళ్లారి అసిస్టెంట్ కమిషన్ రాజేష్ హమాలీలను మందలించారు. తమకు రోజుకు రూ.700 ఇస్తున్నారని పొట్టకూటి కోసం హమాలీ పనులు చేస్తున్నామని కూలీలు తెలిపారు. రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలించడం నేరం.. అందులో పనిచేయడం కూడా తప్పేనని హమాలీలను హెచ్చరించారు.
కుమ్మక్కవుతున్న రేషన్ డీలర్లు, పౌరసరఫరా శాఖ అధికారులు
లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు
బియ్యాన్ని పాలిష్ చేసి
అధిక ధరకు విక్రయాలు
ఉత్తర కర్ణాటక నుంచి
దేశ, విదేశాలకు ఎగుమతి
బళ్లారిలో పట్టుబడిన
260 క్వింటాళ్ల బియ్యం
ఆగని రేషన్ బియ్యం రవాణా
ఆగని రేషన్ బియ్యం రవాణా


