చలి ప్రతాపం.. జనం హాహాకారం
కళ్యాణ కర్ణాటకలో అతి శీతలం
● ఆరెంజ్ అలర్ట్ జారీ
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఆదివారం హావేరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 8.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీనికి తోడు చలి, గాలులు, పొగమంచు వల్ల పిల్లలు, వృద్ధులు, రోగులు సతమతం అవుతున్నారు. మధ్యాహ్నమైనా వణుకు పుడుతోంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన జిల్లాల్లో హావేరి 9వ స్థానంలో ఉంది. బీదర్ మొదటి స్థానంలో, బెల్గాం రెండవ స్థానంలో, ధార్వాడ్ జిల్లా మూడవ స్థానంలో ఉన్నాయి.
వాకింగ్ కష్టమే
దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నగరం, గ్రామంలో ఉదయం దట్టంగా పొగమంచు ఆవరిస్తోంది. దీని కారణంగా పార్కులు, రహదారుల్లో వాకింగ్‌కు వెళ్లేవారు భయపడి ఇళ్లలోనే ఉండిపోతున్నారు. పొలాలకు వెళ్లాలంటే రైతులు, కూలీలు అమ్మో అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు చలిని తట్టుకుంటూ పొలాల్లో పనులు చేస్తున్నారు. స్వెటర్‌లు, జెర్కిన్లు, కంబళ్లు వంటి మందపాటి బట్టలు ధరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం చలి మంట వేసుకోవడం పరిపాటైంది. ఇక టీషాపుల్లో టీలు, కాఫీలకు రద్దీ ఏర్పడింది. ఎక్కడ టీ అంగడి, హోటల్ ఉన్నా జనం గుమిగూడుతున్నారు.
పలు జిల్లాల్లో తీవ్ర చలి, గాలులు
అనారోగ్య సమస్యలు
అత్యంత శీతల వాతావరణం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి అనారోగ్యం వస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు వంటివి ఆరోగ్యంగా ఉన్నవారికీ వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం బయట నడవడం మానుకోండి. ప్రయాణం తగ్గించుకోవాలి. వేడి నీటిని ఉపయోగించాలి అని వైద్యులు చెబుతున్నారు.
శివాజీనగర: చలి తీవ్రతరమైన నేపథ్యంలో ఉత్తర కర్ణాటకలో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. కళ్యాణ కర్ణాటకలో కల్బుర్గి, బీదర్, విజయపుర, బెళగావి, బాగలకోట, హావేరి, యాదగిరి, ధార్వాడ, కొప్పళ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తీవ్ర చలి, గాలులు ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే అధిక చలి ఉండగా, మరింత శీతల వాతావరణం అలముకోనుంది. విజయపుర జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ప్రజలు చలికి గజగణ వణికిపోతున్నారు. గత పది సంవత్సరాల్లో రెండోసారి ఉష్ణోగ్రత కనీస స్థాయికి చేరింది. 2023లో విజయపురలో 6.5 డిగ్రీల అతి స్వల్ప తాపం నమోదైంది.
ఉద్యాన నగరిలో
బెంగళూరు నగరంలో కూడా తీవ్రమైన చలి ఉంటుండగా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కమ్ముకొని చల్లగాలులు వీస్తున్నాయి. కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా ఉంటోంది. హెచ్‌ఏఎల్ పరిధిలో ఆదివారం 13 డిగ్రీలకు పడిపోయింది. వాకింగ్‌కు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు.
చలి ప్రతాపం.. జనం హాహాకారం


