నమో నాగనాథ
చింతామణి: పట్టణంలోని పురాణ ప్రసిద్ధి గాంచిన నాగనాథేశ్వరస్వామి ఆలయంలో లింగాకారునికి సోమవారం ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. భక్తులు పెద్దఎత్తున వచ్చి దర్శించుకొన్నారు. అర్చకులు నాగేంద్ర ఉదయం నుంచి శివలింగానికి అభిషేకం, పూలు నిర్వహించారు.
నడిరోడ్డుపై ఉన్మాద చేష్టలు
దొడ్డబళ్లాపురం: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆడవాళ్లని వెంటపడి వేధిస్తున్న కామాంధున్ని బెంగళూరు కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. హారోహళ్లిలోని మాదేశ్వరగనర నివాసి వినోద్ (27) నిందితుడు. సుమనహళ్లి జంక్షన్ వద్ద స్కూటీలో వెళ్తున్న మహిళను ఫాలో చేసిన వినోద్ ఆమెను అసభ్యంగా తిడుతూ గట్టిగా కౌగిలించుకుని పరారయ్యాడు. భీతిల్లిన బాధితురాలు 112కి కాల్ చేయగా హొయ్సళ పోలీసులు గాలించి పోకిరీని బంధించారు. వినోద్ తరచూ ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. చీకటి పడితే రోడ్డెక్కి మహిళలను వెంటాడేవాడని తెలిపారు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు.
ప్రియురాలే గెలిచింది
● పెళ్లి మండపంలో మూడుముళ్లు
రాయచూరు రూరల్: ప్రేమ, పెళ్లి పేరుతో యువత దారి తప్పుతున్న ఉదంతాల నేపథ్యంలో పెళ్లి వేడుకలో ప్రియురాలు రచ్చ చేసి ప్రియున్ని వివాహమాడిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈనెల 12న నగరంలో రిషభ్‌కు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో వివాహం జరిపిస్తున్నారు. ఇన్ స్టాలో చూసి తెలుసుకున్న ప్రేయసి నగరానికొచ్చి పెళ్లిని నిలిపేసింది. రిషభ్ బళ్లారిలో చదువుతున్న సమయంలో కొప్పళకు చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించి, మళ్లీ ఓ గుడిలో మూడుముళ్లు వేశాడు. తాజాగా ఆమెను దూరంగా ఉంచి తల్లిదండ్రులు చెప్పినట్లు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో కళ్యాణ మంటపానికి చేరుకున్న ప్రియురాలు పోలీసుల సహకారంతో పెళ్లిని నిలుపుదల చేసి, పెద్దల సమక్షంలో తానే వివాహం చేసుకుంది. ఈ తతంగంపై మరో అమ్మాయి తరఫు బంధువులు భగ్గుమన్నారు. ప్రేమ బాగోతాన్ని దాచిపెట్టి మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని నిలదీశారు.
వృద్ధురాలిపై అఘాయిత్యం
మాలూరు: ఎటుచూసినా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి అపరిచితుడు చొరబడి సుమారు 75 సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన తాలూకాలోరని ఓ గ్రామంలో జరిగింది. వివరాలు.. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో తలుపులు పగులగొట్టి చొరబడిన దుండగుడు ఆమె నోరు నొక్కిపెట్టి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు పెనుగులాడడంతో చివరకు పరారు అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మాలూరు పోలీసులు మృగాని కోసం గాలింపు చేపట్టారు.
ప్రైవేటు బస్సు దగ్ధం
దొడ్డబళ్లాపురం: ఓ ప్రైవేటు బస్సు నడిరోడ్డు మీదే కాలి బూడిదైన సంఘటన కొడగు జిల్లాలో జరిగింది. సోమవారం ఉదయం కేరళ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సు మడికెరి సమీపంలోని మాకుట్ట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వెళ్తుండగా మంటలు చెలరేగాయి. బస్సులో డ్రైవర్, కండక్టర్ మాత్రమే ఉన్నారు. ఇద్దరూ కిందకు దిగి దూరంగా పరిగెత్తారు. ఫైర్ సిబ్బంది వచ్చి ఆర్పివేసేటప్పటికి బస్సు పూర్తిగా కాలిపోయింది.
నమో నాగనాథ
నమో నాగనాథ


