జైలా.. మొబైల్ షాపా?
దొడ్డబళ్లాపురం: కార్వార జైల్లో అశాంతి నెలకొంది. తరచూ గొడవలు, విధ్వంసాలు జరుగుతున్నాయి. తాజాగా ఖైదీల వద్ద భారీగా మొబైల్‌ఫోన్లు పట్టుబడ్డాయి. జైలు ప్రధానాధికారి కొణ్ణూరు మల్లికార్జున జైల్లో తనిఖీలు చేయగా 7 మొబైళ్లు, ఇంకా కొన్ని నిషేధిత వస్తువులు లభించాయి. ఈ చెరసాలలో వారం రోజుల్లో రెండు సార్లు ఖైదీలు పోట్లాటకు దిగారు. మత్తు పదార్థాలు రాకుండా అడ్డుకున్నారనే కోపంతో జైలు సిబ్బంది మీద దాడికి పాల్పడ్డారు. కంప్యూటర్, టీవీలను పగలగొట్టారు. ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించారు. కొట్లాటలకు కారణమైన మంగళూరుకు చెందిన నలుగురు ఖైదీలను బళ్లారి, బెళగావి జైళ్లకు తరలించారు. రెండు నెలల క్రితం మంగళూరు జైలు నుంచి వీరిని తీసుకురాగా అందరితో రగడ పడుతూ వీరంగం సృష్టించేవారు.
గుడ్లకు మళ్లీ టెస్టులు
బనశంకరి: కోడిగుడ్ల వల్ల హాని లేదు అని ఆరోగ్య మంత్రి దినేశ్ గుండూరావు చెప్పినప్పటికీ.. గుడ్లపై అనుమానాలు తగ్గలేదు. బెంగళూరులో దుకాణాల్లో విక్రయించే కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చర్చ సాగుతున్న నేపథ్యంలో గుడ్లను సేకరించి క్యాన్సర్ కారకాలపై పరీక్షలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఆరోగ్య, ఆహారశాఖ అధికారులు నగరవ్యాప్తంగా షాపులు, సూపర్ మార్కెట్లు తదితరాలలో గుడ్లను సేకరిస్తున్నారు. 50 చోట్లకు పైగా తీసుకుని ల్యాబ్‌కు పంపించే పనిలో ఉన్నారు. గతంలోనూ ఇదే అనుమానంతో పరీక్షలు చేపట్టగా హానికర అంశాలేవీ బయటపడలేదు. ఓ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న గుడ్లలో నిషేధిత నైట్రోఫురాన్ యాంటిబయాటిక్‌తో పాటు మరో రసాయనం ఉన్నట్లు తేలింది. ఇవి క్యాన్సర్ కారకమని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
విమానంలో చిక్కుకున్న ఎమ్మెల్యేలు
శివాజీనగర: దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సుమారు 4 గంటలకు పైగా కర్ణాటకకు చెందిన 21 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. ఓట్ చోరీ ధర్నాలో పాల్గొనేందుకు అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. దావణగెరెకు రావాలని సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బెళగావికి వెళ్లే విమానం ఎక్కారు. కానీ పొగమంచు వల్ల టేకాఫ్ కాలేదు. ఉదయం 10 గంటలైనా కూడా విమానం ఎగరలేదు. చివరకు 11 గంటల తరువాత విమానం బయల్దేరింది. మంత్రులు లక్ష్మి హెబ్బాళ్కర్, జార్జ్ సహా ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
జైలా.. మొబైల్ షాపా?


