అజాత శత్రువు శామనూరు
శివాజీనగర: దావణగెరె సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప (94) సేవలను అసెంబ్లీ కొనియాడింది. శివశంకరప్ప ఆదివారం వృద్ధాప్యంతో కన్నుమూయడం తెలిసిందే. సోమవారం బెళగావిలో రెండురోజుల సెలవుల తరువాత అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో శామనూరుకు శ్రద్ధాంజలి ఘటించి నిమిషం పాటు మౌనం పాటించి, సభను మంగళవారానికి వాయిదా వేశారు. మొదట సభ ఆరంభంకాగానే విధానసభ స్పీకర్ యూ.టీ.ఖాదర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శామనూరు శివశంకరప్ప ప్రజాభిమానం పొందిన నాయకుడు, ఆయన ఓర్పు, ఆదర్శాలు మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. ఎవరితోను శత్రుత్వం లేని అజాత శత్రువని చెప్పారు. సీఎం సిద్దరామయ్య ప్రసంగిస్తూ శామనూరుతో తనకున్న అనుబంధం, ఆయన గొప్పతనాన్ని వర్ణించారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్‌తో పాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
అసెంబ్లీని మరో వారం పొడిగించండి: అశోక్
బనశంకరి: బెళగావి శీతాకాల సమావేశాలను మరో వారంరోజుల పాటు పొడిగించాలని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుంచి 19 వరకు అసెంబ్లీ జరుగుతుంది, కానీ పలు కారణాలతో రెండురోజుల సమయం వృథా అయింది. దీంతో సమావేశాలు మరోవారం రోజులు పాటు విస్తరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యల గురించి చర్చించాల్సి ఉందన్నారు.
సుత్తూరు స్వామి సంతాపం
మైసూరు: శివశంకరప్ప మృతి విచారకరమని మైసూరు సుత్తూరు మఠాదిపతి శివరాత్రి దేశికేంద్రస్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దావణగెరె జిల్లాలోని శ్యామనూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బిఎస్సీ చదివి, బియ్యం వ్యాపారం ప్రారంభించి అందులో రాణించారు. దావణగెరె మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తరువాత వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆయన ప్రజాదరణకు నిదర్శనం అని పేర్కొన్నారు.
దివంగత ఎమ్మెల్యేకు అసెంబ్లీలో ఘన నివాళి
అజాత శత్రువు శామనూరు


