చురుగ్గా డ్యామ్‌పై కొత్తగేట్ల పనులు
హొసపేటె: కల్యాణ కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయంపై కొత్త గేట్లను అమర్చేందుకు బోర్డు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. జలాశయం యొక్క పాత గేట్ల తొలగింపు ఇప్పటికే వేగం పుంజుకొంది. డిసెంబరు 20వ తేదీ తర్వాత కొత్త గేట్లను అమర్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
గుజరాత్ సంస్థకు పనుల అప్పగింత
తుంగభద్ర జలాశయంపై కొత్త గేట్లను అమర్చే పనులకు టెండర్‌ను గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్ అండ్ మెషినరీ టూల్ కంపెనీ దక్కించుకుంది. రూ.52 కోట్లతో కొత్త గేట్లను అమర్చాల్సి ఉంటుంది. జలాశయం యొక్క 33 క్రస్ట్ గేట్లలో 15 గేట్లు ఇప్పటికే అమర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఇప్పటికే రూ.20 కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్లు వెచ్చించనున్నాయి. ఈ నిధులతో కొత్త గేట్ల నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి.
పాత గేట్లు తొలగింపు...
జలాశయంలోని పాత గేట్లు తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. 18, 20, 24వ గేట్లను నైపుణ్యం కలిగిన కార్మికులను ఉపయోగించి తొలగించారు. జలాశయం యొక్క 27వ క్రస్ట్ గేట్ తొలగించే పని ప్రారంభమైంది. ఒకవైపు జలాశయం పాతగేట్ల తొలగింపు పనులు చేపడుతూనే, కొత్త గేట్ల ఏర్పాటుకు కర్ణాటక సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయంలో నీటి మట్టం 1613 అడుగులకు పడిపోయిన వెంటనే కొత్త గేట్లను అమరుస్తారు. రాబోయే ఐదు నుంచి ఆరు రోజుల్లో జలాశయం నీటి మట్టం 1618.95 అడుగుల నుంచి 1613 అడుగులకు తగ్గుతుంది. ఇందుకోసం ఇప్పటినుంచే నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పనులు ప్రారంభించి జూన్ 2026 నాటికి అన్ని గేట్లను ఏర్పాటు చేస్తామని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి.
తుంగభద్ర జలాశయానికి 33 కొత్త క్రస్టు గేట్ల ఏర్పాటుకు ప్రణాళిక
డిసెంబరు 20 తర్వాత పనులు
చేపట్టేందుకు ముహూర్తం ఖరారు


