కంపించిన ఇళ్లు.. జనం పరుగులు
సాక్షి బళ్లారి: ఉన్నపాటుగా భయంకరమైన శబ్ధం... ఇళ్లు కంపిస్తూ.. వస్తువులు, సామగ్రి కదిలి కిందపడ్డాయి. దీంతో జనం భయంతో బయటికి పరుగు తీశారు. చిత్రదుర్గం– దావణగెరె జిల్లాల మధ్య గల పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈ పరిస్థితి తలెత్తింది. స్థానికుల వివరాల మేరకు.. శనివారం రాత్రి పొద్దుపోయాక జనం గాఢ నిద్రలో ఉన్నారు. దావణగెరె తాలూకా బాలరామాపురం, చిత్రదుర్గం జిల్లా మొల్కామూరు తాలూకా కోలంమ్మనహళ్లి, తదితర గ్రామాల్లో రాత్రి బాంబు పేలినట్లు భారీ శబ్ధం వినిపించింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇళ్లల్లో వస్తువులు, సామాగ్రి కదిలి చిందర వందరగా పడ్డాయి. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగు తీశారు. ఇది భూకంపమా.. లేదా బాంబు పేలుళ్లా తెలియక ఆందోళన చెందుతూ ఇళ్లల్లోకి వెళ్లకుండా రాత్రంతా బయటే జాగరణ చేశారు. జగళూరు తహసీల్దారు ఘటనా స్థలాన్ని సందర్శించి మాట్లాడుతూ విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా కళ్లల్లి సమీపంలో శబ్ధం వినిపించిందని, అయితే జనం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. తనిఖీచేసి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అధికారులకు స్థానికులు విజ్ఙప్తి చేశారు.
దావణగెరె – చిత్రదుర్గం జిల్లాలో పేలుడు శబ్ధం
ఇళ్లల్లోని సామగ్రి, వస్తువులు కదలడంతో భయపడిన జనం


