ఎన్నికలకు ముందే బీజేపీ నేతలు వస్తారు
సాక్షి,బళ్లారి: ఎన్నికలకు ఆరు నెలల ముందే బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరుతారని బీజేపీ బహిషృత ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పేర్కొన్నారు. బెళగావి జిల్లా అథణి నియోజక వర్గంలో మరాఠా సమాజం తరపున 45 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో యత్నాల్ పాల్గొని మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది శివాజీని ఆరాధిస్తారని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా ఆనాటి శివాజీ పాలన రావాలన్నారు.
తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం
సాక్షి,బళ్లారి: బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ ధరకే బంగారం ఇస్తామని అమాయకులను కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే మళవళ్లి కందూరులో జరిగింది. ఓ వ్యక్తి నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. శివమొగ్గ జిల్లాకు చెందిన పరుశురామ, న్యామతిదానిహళ్లి గ్రామానికి చెందిన మనోజ్ ఇద్దరు తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పారు. మండ్య జిల్లా మళవళ్లి కందూరు గ్రామానికి చెందిన మూర్తి వారి మాయమాటలు నమ్మి రూ.6 లక్షలు ఇచ్చారు. తొలుత నాణ్యమైన బంగారం ఇచ్చి.. తర్వాత నకిలీ బంగారం ఇవ్వడంతో బాధితుడు మోసపోయినట్లు గమనించాడు. దావణగెరె జిల్లా హోన్నళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.


