విమానాశ్రయానికి భూములు ఇవ్వం
హోసూరు: హోసూరు ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు రైతుల సాగుభూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తామని రైతులు తెలిపారు. స్థానికంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాల్లో ఐదు ప్రాంతాలను పరిశీలించి రెండు ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమానికి సిద్ధమైంది. ఆదివారం రైతు రక్షణ సంఘ అధ్యక్షులు గణేష్‌రెడ్డి, సంఘ నాయకులు, కార్యకర్తలు బాధిత రైతులు మాజీ మత్రి పి. బాలక్రిష్ణారెడ్డిని కలిశారు. ఇప్పటికే జాతీయ రహదారి, సిఫ్‌కాట్, ఎస్‌టిఆర్‌ఆర్ రింగ్‌రోడ్డు వంటి అభివృద్ది పనులకు రైతుల నుంచి 25 వేల ఎకరాల సాగుభూములను లాక్కొన్నారని, రైతుల నుంచి స్వాధీనపరుచుకొన్న భూములకు సరైన పరిహారం కూడా చెల్లించలేదని, ఈ నేపథ్యంలో మళ్లీ భూసేకరణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వివిధ పథకాలకు భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు కూలీలుగా పనులు చేస్తున్నారని, తమ జీవితం కూడా అంతే అవుతుందని వాపోయారు. భూములు తీసుకుంటే ఆందోళనలు చేపడతామని తెలిపారు.


