అక్రమ మద్యాన్ని అరికట్టాలని 17న ధర్నా
కోలారు: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆబ్కారి కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించాలని రైతు సంఘం పదాధికారులు తీర్మానం చేశారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద పదాధికారులు సమావేశమయ్యారు. సంఘం రాష్ట్ర సంచాలకుడు నారాయణగౌడ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటికి కరవు ఉన్నా మద్యానికి మాత్రం లోటు లేదనే విధంగా పరిస్థితి తయారైందన్నారు. గ్రామీణ ప్రదేశాల్లో, టీ బంకులు, చిల్లర దుకాణాలలో మద్యం లభిస్తోందన్నారు. యువత, కార్మికులు మద్యానికి బానిసలయ్యారని, దీంతో పేదల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 17వ చీపుర్లు, మహిళల మెడలోని పుస్తెల సమేతంగా ప్రతిఘటన నిర్వహించాలని తీర్మానం చేశామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, బంగవాది నాగరాజగౌడ, తదితరులు ఉన్నారు.


