ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన

Dec 15 2025 10:07 AM | Updated on Dec 15 2025 10:07 AM

ప్రజల

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన

శివాజీనగర: సీఎం కుర్చీ మార్పిడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న సందర్భంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్‌ నాయకులతో భేటీలు జరిపారు. ఆదివారం హస్తినలో రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్‌ చోరీ ఆందోళనలో సీఎం సిద్దరామయ్య, డీకే, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రముఖులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భోజనం ఏర్పాటు చేశారు. సిద్దరామయ్య ఆలస్యంగా ఢిల్లీకి చేరుకొన్నారు. డీకే శనివారం సాయంత్రమే వెళ్లి రాజకీయ మంత్రాంగాన్ని ఆరంభించారు. కర్ణాటక భవన్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు డీ.కే తో చర్చలు జరిపారు. తరువాత ఖర్గే ఏర్పాటు చేసిన విందుకు వెళ్లారు. అక్కడ ఖర్గే తో పాటు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలను కలిసినట్లు సమాచారం. ఈ సమయంలో డీకే తన వాదనను హైకమాండ్‌కు వినిపించారు. అధికార మార్పిడి గొడవ మొదలయ్యాక డీకే తొలిసారిగా రాహుల్‌ను కలవడం గమనార్హం. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, అలాగే 2 బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశాల వివరాలనూ డీకే వివరించినట్లు తెలుస్తోంది. సీఎం కుర్చీ మార్పిడి గురించి ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం జరుపుదామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో హడావుడి లేకుండా ఉన్నారు. డీకే సన్నిహిత ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుసేన్‌.. డీకే జనవరి 6 గాని, 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఇటీవల ప్రకటించారు. ముఖ్యమంత్రి మార్పు లేదని సిద్దరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చెబుతున్నారు. దీంతో ఏం జరగబోతుందనేది గందరగోళంగా మారింది.

మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కర్ణాటక భవన్‌లో బస చేశారు. డీసీఎం డీకే శివకుమార్‌తో పలువురు మంతనాలు జరిపారు. వారితో ఆయన అల్పాహారం సేవించారు. ఆర్‌.బీ.తిమ్మాపుర, మాంకాళ వైద్య, మాజీ మంత్రి తన్వీర్‌ సేఠ్‌, ఎమ్మెల్యేలు అల్లమప్రభు పాటిల్‌, ప్రదీప్‌ ఈశ్వర్‌, ఆనేకల్‌ శివణ్ణ, ఏసీ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు సలీమ్‌ అహమ్మద్‌, పుట్టణ్ణ, మంజునాథ్‌ భండారితో పాటుగా పలువురు డీకేతో విడివిడిగా కలిశారు. ఈ అల్పాహార విందు కుతూహలానికి కారణమైంది. డీకే శివకుమార్‌ అభిమానులు ఢిల్లీలో హల్‌చల్‌ చేశారు. కాబోయే సీఎం డీకే శివకుమార్‌కు జై అంటూ నినాదాలు చేశారు. ఓట్‌ చోరీ ఆందోళన జరుగుతున్న రాంలీలా మైదానంలో డీకే అభిమానులు జై జై నినాదాలు చేశారు.

ఓట్‌చోరీ ఆందోళనకు

సీఎం సిద్దు, డీసీఎం శివ హాజరు

ఖర్గే విందు భేటీలో శివకుమార్‌

రాహుల్‌గాంధీతో

రాష్ట్ర రాజకీయాలపై చర్చ

దేశంలోని 140 కోట్ల మంది ఓటు హక్కును కాపాడేందుకు తాము ఓట్‌ చోరీకి విరుద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని డీసీఎం డీ.కే.శివకుమార్‌ అన్నారు. ఆదివారం ఢిల్లీలో కర్ణాటక భవన్‌లో శివకుమార్‌ విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో బెంగళూరు ఫ్రీడంపార్కులో తాము ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా పోరాటం ఆరంభించామని, ఇప్పుడు ఢిల్లీలో జరుపుతున్నామని చెప్పారు. ఈ దేశంలో నిర్భయంగా, న్యాయసమ్మతంగా ఎన్నికలు జరపాలని సందేశం ఇస్తున్నామన్నారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు న్యాయసమ్మతంగా జరగలేదు. ఓట్ల చోరీ జరుగుతోంది. ఇందుకు వేలాది ఉదాహరణలు ఉన్నాయి. ఇంత జరిగినా కూడా ఎన్నికల కమిషన్‌ సరైన సమాధానం ఇవ్వడం లేదు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్లపైకి వచ్చాం అని అన్నారు. కర్ణాటక నుంచి సుమారు 4 వేల మంది కార్యకర్తలు, నాయకులు సొంత ఖర్చులతో వచ్చారన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవాలి, ఓటు హక్కును కాపాడాలని వచ్చారని తెలిపారు. ఢిల్లీకి వచ్చే వాహనాలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. తమ పోరాటాన్ని అడ్డగించడం సాధ్యం కాదని అన్నారు. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ఆయన సంతోషం కోసం ఏమైనా మాట్లాడతారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు.

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన 1
1/2

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన 2
2/2

ప్రజల కోసమే ఓట్‌ చోరీ ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement