16న మళవళ్లికి రాష్ట్రపతి రాక
● హెలికాప్టర్ రిహార్సల్స్
మండ్య: మండ్య జిల్లాలోని మళవళ్ళి పట్టణంలోని సుత్తూరు ఆదిజగద్గురు శ్రీ శివరాత్రి శివయోగి 1,066వ జయంతి మహోత్సవం డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలకు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 16న వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి భద్రత దళ అధికారులు వచ్చి మారేహళ్లి సమీపంలో నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలికాప్టర్‌తో ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఎక్కడ, ఎలా జరగాలనేది స్థానిక అధికారులతో కలిసి చర్చించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చన్నబసవస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్, జడ్జి దివ్య, ఎస్పీ మల్లికార్జున బాలదండి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్సవాలకు ప్రధాన వేదిక, ప్రదర్శన స్టాళ్లు, క్యాటరింగ్ వ్యవస్థ, లక్షలాది భక్తులకు సరిపడేలా వసతి, పార్కింగ్ తదితరాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. అంతటా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
ఏనుగు దాడిలో రైతన్న బలి
శివాజీనగర: రామనగర జిల్లాలో అడవి ఏనుగు దాడిలో రైతు బలైన ఘటన హారోహళ్ళి తాలూకా దుమ్మసంద్ర గ్రామంలో జరిగింది. రైతు పుట్టెమాదేగౌడ (48) ఆదివారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు వెళ్తుండగా ఏనుగు దాడి చేసింది. తొండంతో కొట్టి తొక్కేయడంతో ఆయన అక్కడే మరణించాడు. బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ ఏనుగు రాత్రంతా రైతుల పొలాల్లో పంటలను ఆరగించి పాడుచేసింది. అటవీ అధికారులు పరిశీలించగా, వారికి విరుద్ధంగా గ్రామస్థులు ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి, పంటలకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పదేపదే ఏనుగుల దాడులు జరుగుతున్నాయి, అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గుడ్లతో ప్రమాదం లేదు: మంత్రి
శివాజీనగర: ప్రజలు ఎంతో ఇష్టపడి ఆరగించే కోడి గుడ్డు గురించి కొన్నిరోజులుగా వ్యతిరేక ప్రచారం సాగుతోంది. గుడ్లలో ఏఓజెడ్ అనే క్యాన్సర్ కారకం బయటపడిందని ప్రచారం వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో నూ భారీ చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆరోగ్య మంత్రి దినేశ్ స్పందించారు. కొన్ని నెలల క్రితం గుడ్లకు ల్యాబ్‌లో పరీక్షలు చేయించాం. వాటిలో హానికరమైన అంశాలు బయటపడలేదు. కేంద్రం నుంచి కూడా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు అని చెప్పారు.
మెట్రో చార్జీల తగ్గింపు ఉండదు
శివాజీనగర: కొన్ని నెలల కిందట మెట్రో రైలు చార్జీల ధరలను పెంచడం తెలిసిందే. చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మెట్రో చార్జీల నిర్ధారణ కమిటీ తిరస్కరించింది. చార్జీల తగ్గింపునకు అవకాశం లేదని తెలిపింది. అంతేకాకుండా స్టూడెంట్ పాస్‌లను మంజూరు చేయలేమని తెలిపింది. విద్యార్థులకు పాస్‌లు ఇవ్వాలని విద్యా సంస్థల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని తెలిపింది.
ఆర్టీసీ బస్సు కింద నలిగిన బాలిక
బనశంకరి: బస్సు ఎక్కుతుండగా బాలిక అదుపుతప్పి కిందపడిపోగా కేఎస్ ఆర్టీసీ డ్రైవరు గమనించకుండా ముందుకెళ్లడంతో చక్రం కింద నలిగి చనిపోయింది. ఈ ఘటన హాసన్ జిల్లా అరసికెరె తాలూకా హొళళ్కరె గేట్ వద్ద జరిగింది. వివరాలు.. బాలిక భార్గవి (4)ను తీసుకుని తల్లి యమున ఆదివారం దొడ్డమేటికుర్కేలోని ఆసుపత్రికి బయలుదేరింది. హొళల్కెరె గేట్ వద్ద బస్ ఎక్కుతుండగా బాలిక అదుపుతప్పి కిందపడింది. ఈ సమయంలో బస్‌డ్రైవరు గమనించకుండా వెళ్లడంతో బాలిక దుర్మరణం చెందింది. కళ్లముందే కూతురి మరణంతో తల్లి శోకతప్తురాలైంది. వెంటనే ఘటనా స్థలానికి అరసికెరె రూరల్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. డ్రైవరుపై కేసు నమోదు చేసి బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


