ఎస్‌ఐ కావాలనుకుని.. దొంగ అయ్యాడు
● నకిలీ పోలీసు ముఠా అరెస్టు
బనశంకరి: పోలీసుల వేషంలో డబ్బు వసూళ్లకు పాల్పడిన నకిలీ ఎస్‌ఐ తో పాటు నలుగురిని ఆదివారం బెంగళూరు విద్యారణ్యపుర పోలీసులు అరెస్ట్‌చేశారు. మల్లికార్జున, ప్రమోద్, వినయ్, హృత్విక్ పట్టుబడినవారు. వివరాలు.. ఎస్‌ఐ కావాలని మల్లికార్జున రెండుసార్లు పరీక్ష రాసి విఫలమయ్యాడు. కానీ పరీక్ష పాసై ఎస్‌ఐ అయినట్లు సొంతూరు సిరుగుప్పలో చెప్పుకున్నాడు. ఎస్‌ఐ డ్రెస్సు ధరించి, లాఠీ పట్టుకుని ఫోటోషూట్ చేసి నేను బెంగళూరులో ఎస్‌ఐ అని బడాయిగా ప్రచారం చేసుకున్నాడు. విలాసవంతమైన జీవనం గడపాలని మల్లికార్జున కలలు కనేవాడు. ఇతనికి హృత్విక్ తోడయ్యాడు. తన స్నేహితుడు నవీన్ ఇంట్లో భారీగా డబ్బు, బంగారం ఉందని, చోరీ చేద్దామని హృత్విక్ చెప్పాడు. ఇలా పోలీస్ యూనిఫాం ధరించి నవీన్ ఇంటికి కారులో నలుగురు వెళ్లారు, మీరు గంజాయి విక్రయిస్తున్నారు, ఇంట్లో సోదాలు చేయాలని బెదిరించి నవీన్‌ను లాఠీ, ఇసుపరాడ్‌తో చితకబాదారు. అరెస్ట్ చేయరాదంటే డబ్బు ఇవ్వాలని నవీన్ అకౌంట్‌లో ఉన్న రూ.87 వేలనగదు, బీరువాలో ఉన్న రూ.55 వేలు తీసుకుని ఉడాయించారు. బాధితుడు విద్యారణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గాలించి ఆదివారం కిలాడీలను పట్టుకున్నారు. రూ.45 వేల నగదు, కారును సీజ్ చేశారు.
నయవంచకునిపై కేసు
మండ్య: జిల్లాలోని కేఆర్ పేటె తాలూకాలోని అక్కిహెబ్బలు హొబలిలో పుర గ్రామానికి చెందిన యువతిని పక్కింటి యువకుడు ప్రేమపేరుతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు కె.ఆర్.పేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై కేసు నమోదైంది. వివరాలు.. కేఆర్ పేటె తాలూకాలోని పుర గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి ఇంటి పక్కనే పృథ్వీ నాయక్ ఇల్లు ఉంది. ఇద్దరూ పరిచయమై ప్రేమించుకునేవరకూ వెళ్లింది. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడని ఫిర్యాదులో తెలిపింది. సంవత్సరం పాటు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అనారోగ్యం రావడంతో అక్టోబర్ 17న ఆమె కె.ఆర్. నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, వైద్యులు పరీక్షించి గర్భవతి అని తెలిపారు. దీంతో యువతి తల్లిదండ్రులు పృథ్వీ తల్లికి చెప్పగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరింది. కానీ పృథ్వీ కుటుంబం పెళ్లి అంటే తిరస్కరిస్తోంది, దీంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. పుట్టుకతోనే కుడి కాలి వైకల్యం ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.
అంతర్రాష్ట్ర చోరుడు అరెస్టు
బొమ్మనహళ్లి: కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగని బెంగళూరు దక్షిణలోని జిగని పోలీసులు పట్టుకున్నారు, అతని నుంచి కొన్ని బైక్‌లు, బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. అనేక చోరీ కేసుల్లో ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడు. పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. జిగనిలోని తన అక్క ఇంటికి వచ్చాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇంటిని చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. హత్య, దోపిడీలు, దొంగతనాలు సహా 60 కేసుల్లో నిందితుడైన ప్రమాదకరమైన నేరగాడు అని పోలీసులు తెలిపారు.


