ఎట్టకేలకు రౌడీ చిరుత బందీ
మైసూరు: గత కొన్నిరోజులుగా గ్రామస్తులను సతాయిస్తున్న చిరుతపులి చివరకు బోనులోకి చిక్కింది. మైసూరు తాలూకాలోని దొడ్డమారెగౌడనహళ్ళిలో చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తూ మేకలు, గొర్రెలు, కుక్కలను ఎత్తుకుపోతోంది. దీంతో ప్రజలు సాయంత్రమైతే బయటకు రావాలంటే భయపడుతున్నారు. అటవీ సిబ్బంది ఓ తోటలో బోనును ఏర్పాటు చేశారు. 8 నుంచి 10 ఏళ్ల వయసుగల మగ చిరుత అందులో బందీ అయ్యింది. అటవీ సిబ్బంది దానిని బంధించి తరలించారు.
ఆవును చంపిన పులి
జిల్లాలోని హెచ్‌డి కోటే తాలూకాలో సరగూరు సమీపంలో చౌడహళ్లి గ్రామంలో ఆవును పెద్దపులి హతమార్చింది. పొలంలో కట్టేసిన ఆవుపై పులి దాడి చేసింది. ఆవు ఆర్తనాదాలు విని దగ్గరిలోని ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేయడంతో పులి అక్కడి నుండి పారిపోయింది. ఇటీవలే తల్లి పులి, నాలుగు పిల్ల పులులను బంధించారని ఊపిరి పీల్చుకున్న ప్రజలు, మళ్లీ పులి క్రూరత్వాన్ని చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.


