పెళ్లి వేడుకలో ప్రియురాలి రచ్చ
శివాజీనగర: పది సంవత్సరాల నుంచి ప్రేమించిన యువతికి చేయిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో మోసకారి ప్రియుడు. పెళ్లి మండపానికి ప్రియురాలు వచ్చి రభస చేసింది. పంచాయతీ చివరకు పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన 13న చిక్కమగళూరులో ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. బాధితురాలు, పోలీసుల సమాచారం మేరకు.. స్థానికుడు శరత్ అనే యువకుడు, హాసన్ జిల్లా బేలూరు తాలూకాకు చెందిన యువతిని పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. అతని కుటుంబం సైతం వివాహానికి అంగీకరించింది. దసరా సమయంలో పెళ్లి చర్చలు జరిగాయి. శరత్‌కు గతంలోనే పెళ్లయి, మూడేళ్లకు విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని యువతికి చెప్పలేదు.
అంతలోనే మరో వివాహం
13న మరో అమ్మాయితో ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరిగింది. తాళి కట్టిన కొంతసేపటికి ప్రియురాలు చేరుకుని తానే ప్రియురాలిని, ఈ పెళ్లిని నిలిపివేసి తనను వివాహమాడాలని గొడవకు దిగింది. పోలీసులు వచ్చి ఆమెను, వరున్ని ఠాణాకు తీసుకెళ్లి బుద్ధిమాటలు చెప్పారు. ప్రియురాలినే పెళ్లాడాలని సూచించగా శరత్ అక్కడ సరేనని చెప్పి వచ్చేశాడు. బాధిత యువతిపై శరత్ బంధువులు దాడిచేసినట్లు తెలిసింది.
గుట్టుగా మరో యువతికి
మూడుముళ్లేసిన ప్రియుడు
చిక్కమగళూరులో సంఘటన


