18 రోజుల్లో రూ.14 కోట్ల హైడ్రో గంజాయి పట్టివేత
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిపోర్టులో 18రోజుల్లో కస్టమ్స్ అధికారులు సుమారు రూ.14 కోట్ల విలువైన హైడ్రో గంజాయి, ఈ–సిగరెట్లు సీజ్ చేశారు. బ్యాంకాక్, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులు కొందరు హైడ్రో గంజాయి అక్రమంగా తరలిస్తూ చెకింగ్‌లో పట్టుబడ్డారు. 18 రోజుల్లో రూ.14 కోట్ల విలువైన 38.64 కిలోల హైడ్రో గంజాయి పట్టుబడింది. రూ.2.38 లక్షల విలువైన ఈ–సిగరెట్లు కూడా పట్టుబడ్డాయి. వీటితోపాటు వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద నిషేధించబడ్డ ఎనిమిది రకాల ప్రాణులను అక్రమంగా తరలిస్తుండగా ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా కేసుల్లో 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
డిజిటల్ అరెస్టు
నిందితులను పట్టుకుంటాం
●హోంమంత్రి జీ పరమేశ్వర్
దొడ్డబళ్లాపురం: టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వారినే బెంగళూరులో కూర్చున్నవారు డిజిటల్ అరెస్టు చేసేంతగా ఇక్కడివారు టెక్నాలజీని వాడుతుండడం ఆశ్చర్యంగా ఉందని, అయితే అలాంటి వారిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టేది లేదని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన డిజిటల్ అరెస్టు పేరుతో బెంగళూరు మహిళా టెక్కీ వద్ద రూ.32 కోట్లు దోచుకున్న కేసుకు సంబంధించి స్పందించారు. మహిళా టెక్కీని నిందితులు ఏడాది కాలంగా బెదిరిస్తూ డిజిటల్ అరెస్టు చేసి 187 సార్లు డబ్బులు అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారని, ఆమె ముందే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే విషయం ఇక్కడి వరకూ వచ్చేది కాదన్నారు. ఏదిఏమైనా నిందితులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు.
14 పీజీలకు తాళం
యశవంతపుర: నివాస ప్రాంతాలలో చట్టాలను ఉల్లంఘించి బెంగళూరులో వాణిజ్య పీజీలను నిర్వహిస్తున్న భవనాలపై జీబీఏ అధికారులు మంగళవారం దాడులు చేశారు. నిబంధనలు పాటించని మొత్తం 14 పీజీలకు తాళం వేసినట్లు తూర్పు నగర పాలికె కమిషనర్ డీఎస్ రమేశ్ తెలిపారు. మహదేవపుర, కృష్ణరాజపుర నియోజకవర్గాల వ్యాప్తిలో ఇలాంటి పీజీలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
బిడది వద్ద
కొత్త ఐటీ సిటీ నిర్మాణం
దొడ్డబళ్లాపురం: బిడది వద్ద కొత్త ఐటీ సిటీ నిర్మిస్తున్నట్టు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బెంగళూరులో బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టడానికి వివిధ దేశాల నుంచి కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. త్వరలో బెంగళూరులో జరిగే టెక్ సమ్మిట్‌లో 60 దేశాలకు చెందిన సుమారు 50వేలమంది పాల్గొంటారన్నారు. 1500 కంపెనీలు సమ్మిట్‌కు హాజరవుతాయన్నారు. పెట్టుబడులకు బెంగళూరు తగిన వేదిక అన్నారు. అందుకే అందరూ బెంగళూరు వైపు చూస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లభించాలన్నదే తన ఆశయమన్నారు.


