ఘనంగా హులిగమ్మ దేవి పుష్ప రథోత్సవం
హొసపేటె: ఉత్తర కర్ణాటకలోని ప్రసిద్ధ పవిత్ర స్థలం హులిగిలో నెలకొన్న శక్తి దేవత జగన్మాత హులిగమ్మ దేవి ఆలయంలో గంగావతికి చెందిన నరసింగప్ప అనే పూలు పెంచే కుటుంబం హులిగెమ్మ దేవికి పుష్ప సమర్పణ, రథోత్సవాన్ని నిర్వహించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పూల వ్యాపారి నరసింగప్ప కుటుంబం హులిగమ్మ దేవికి ప్రత్యేక పుష్పాలను సమర్పించి, గర్భగుడి, రాజగోపురం, ఆలయ గోపురం, ఆలయం ముందు భాగం, ప్రధాన రహదారి, ద్వారం సహా మొత్తం ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరణ చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. పుష్ప సమర్పణ సేవ అనంతరం పుష్ప రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పుష్ప రథోత్సవాన్ని వీక్షించారు. గంగావతికి చెందిన నాగరాజ్ నరసింగప్ప కుటుంబం 18 ఏళ్లుగా ఈ సేవను చేస్తోంది. ఈ సంవత్సరం దాదాపు రూ.10 లక్షల ఖర్చుతో ఈ సేవను నిర్వహించినట్లు కార్యనిర్వహక అధికారి ప్రకాశ్‌రావు తెలిపారు.


