ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: అనారోగ్యం నయం కాకపోవడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలానికి చెందిన చల్లా లక్ష్మీనరసింహుడు కుటుంబం అనంతపురంలోని రామ్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు చల్లా శ్రావణ్‌కృష్ణ(18) బళ్లారిలోని బిఐటీఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఇటీవల తల్లిదండ్రులు పిలుచుకువచ్చి చికిత్స చేయిస్తున్నారు. అయితే సమస్యను బయటకు చెప్పుకోలేక మనస్థాపం చెందిన శ్రావణ్ ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా భవనం పైఅంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై నాల్గో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నార్పల మండలంలో
ఓ వివాహిత...
బుక్కరాయసముద్రం (నార్పల): అంతు చిక్కని కారణంతో నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన ఆదినారాయణ భార్య చెన్నమ్మ (55) సోమవారం ఆత్మహత్య చేసు కుంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగించేవారు. కారణాలు ఏమున్నాయో కానీ, సోమవారం మధ్యాహ్నం తోటలోకి వెళ్లిన చెన్నమ్మ అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు.


