రూ.32 లక్షల నగలు స్వాధీనం
రాయచూరు రూరల్: నగరంలో పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి రూ.32 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పడమటి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయన్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరానికి చెందిన గుజ్జల రామకృష్ణను అరెస్ట్ చేశారన్నారు.
వృక్షమాతకు శ్రద్ధాంజలి
రాయచూరు రూరల్: మొక్కలు నాటి పరిసరాల సంరక్షణతో పాటు వటవృక్షాలుగా మార్చిన ఘనత సాలుమరద తిమ్మక్కది అని రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. సోమవారం విశ్వవిద్యాలయంలో మరణించిన వృక్షమాత సాలుమరద తిమ్మక్క మృతికి సంతాపం వ్యక్తం చేశారు. పుత్ర సంతానం కలగలేదనే భావనను పక్కన పెట్టి వృక్షాలే పిల్లలు అంటూ వాటిని పెంచి రక్షిస్తూ వచ్చిన విషయాన్ని తెలిపారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, సుశయీంద్ర, పార్వతి, బిరాదార్‌లున్నారు.
కారు, బైక్ ఢీ..
ఇద్దరు యువకుల దుర్మరణం
రాయచూరు రూరల్: కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా మహాగాంవ్ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. కారు, ద్విచక్ర వాహనాల మధ్య భారీ ప్రమాదం సంభవించడంతో వాహనాలకు నిప్పంటుకొని మరణించిన వారిని ఆకాశ్ ధనవంత(19), సుశీల్(28)లుగా పోలీసులు గుర్తించారు. మహాగాంవ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విశేష రక్తదానం
బళ్లారి అర్బన్: 22వ వార్డు కార్పొరేటర్ కేఏ.హనుమంతప్ప 54వ జన్మదినం సందర్భంగా కప్పగల్ రోడ్డు లయన్స్ క్లబ్‌లో ఉచిత రక్తదాన శిబిరాన్ని విశేషంగా చేపట్టారు. ఈ సందర్భంగా హనుమంతప్పను ఆయన అభిమానులు, బంధుమిత్రులు తదితరులు ఘనంగా సన్మానించారు. హనుమంతప్ప మాట్లాడుతూ ఎప్పటిలానే తన ఆత్మబంధువులు పుట్టిన రోజు వేడుకను యువ సమాజ సేవ ద్వారా జరపడం ఆత్మసంతృప్తి కలిగించిందన్నారు. ఈ విషయంలో సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా రక్తదానం చేశారు. గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 500లకు పైగా నోట్ పుస్తకాలను పంచిపెట్టారు. ప్రముఖులు గుడిగండి హనుమంతప్ప, రాణితోట వీరేష్, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఖాళీలు
భర్తీ చేయరూ
రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక భాగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. పాఠశాలకు స్వీపర్‌ను నియమించి, కర్ణాటక పబ్లిక్ పాఠశాలకు పక్కనే ఉన్న పాఠశాలలను విలీనం చేయాలన్నారు. పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విద్యా శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
రూ.32 లక్షల నగలు స్వాధీనం
రూ.32 లక్షల నగలు స్వాధీనం
రూ.32 లక్షల నగలు స్వాధీనం
రూ.32 లక్షల నగలు స్వాధీనం
రూ.32 లక్షల నగలు స్వాధీనం


