అడవిని వదిలిన 20 పులులు
మైసూరు: అడవిలో ఉండాల్సిన పులులు బయటకొచ్చి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. సుమారు 20 కి పైగా పులులు ఇలా గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు అంచనా వేశారు. మేకలు, పశువులపై దాడి చేయడంతో పల్లెల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు రైతులను కూడా చంపడం లేదా గాయపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో మైసూరు, చామరాజనగర జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు పెరగడంతో పులులను బంధించే పనులు జరుగుతున్నాయి. హెచ్‌డి కోటె ప్రాంతంలో 8 పులులు, మైసూరు చుట్టుపక్కల 5 పులులు తిరుగుతున్నాయి. నంజనగూడు, హుణసూరు, ప్రాంతాల్లో కలిపి 20 పులులు తిరుగుతున్నాయి.
ఊరి మధ్యలో మొసలి
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా కిరంగూరు గ్రామంలో నుంచి వెళ్లే కావేరి నీటి కాలువలో మొసలి వచ్చింది. ప్రజలు చూసి భయాందోళనకు గురయ్యారు. బన్నిమంటపం వద్ద ప్రకాశ్, గుండప్ప అనే వారి ఇంటి ముందు నుంచి వెళ్లే కాలువలో నల్లని మొసలి తిరుగాడుతోంది. ఇళ్లలోనివారు, చిరు వ్యాపారులు భయపడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ కాలువ ప్రధాన రహదారికి దగ్గరగా ఉండడంతో జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎవరిమీదనైనా దాడి చేసే ప్రమాదముందని తెలిపారు.
సర్కారు కంప్యూటర్ కియో
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించిన అత్యాధునిక చిన్నసైజు కంప్యూటర్ కియో (కేఈఓ)ను త్వరలో ప్రదర్శించనున్నట్లు ఐటీ బీటీ మంత్రి ప్రియాంక ఖర్గే, కియోనిక్స్ అధ్యక్షుడు శరత్ బచ్చేగౌడ చెప్పారు. సోమవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ల కొరత అధికంగా ఉందని, రాష్ట్రంలో 15 శాతం మంది వద్ద మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కంప్యూటర్లు లేక వ్యాపారులు, యువత, విద్యార్థులు సాంకేతికతకు దూరమవుతున్నట్లు చెప్పారు. ఈ లోటును తీర్చేలా లినక్స్ ఆధారిత ఓఎస్ ద్వారా ఆధునిక ప్రాసెసర్‌లతో కియోను డిజైన్ చేసినట్లు తెలిపారు. ధర కూడా అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థులకు, చిన్న వ్యాపారులకు, ప్రజలకు సహాయపడుతుందని మంత్రి తెలిపారు. త్వరలో జరిగే బెంగళూరు టెక్ సమ్మిట్‌లో సీఎం సిద్దరామయ్య కియోను ఆవిష్కరిస్తారని చెప్పారు.
డేటింగ్ కిలాడీ అరెస్టు
బనశంకరి: డేటింగ్ పేరుతో అమాయకులను దోచుకుంటున్న ప్రేమికులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కవిప్రియ, హర్షవర్ధన్ నిందితులు. లోన్ యాప్‌లు ద్వారా ఇద్దరు లక్షలాది రూపాయలు రుణాలు చేసి జల్సాలు చేశారు. ఆ అప్పులు తీర్చడం సాధ్యం కాక, డేటింగ్ యాప్ ద్వారా వంచనలకు పాల్పడుతున్నారు. హ్యాపెన్ యాప్‌లో ఫోటో అప్‌లోడ్ చేసి యువకులకు వలవేసేవారు. ఇదే మాదిరిగా కవిప్రియ యువకులకు గాలం వేసి మత్తులోకి దించి డబ్బు బంగారాన్ని దోచుకుంటోంది. నవంబరు 1వ తేదీన ఓ యువకున్ని ఇందిరానగరలో లాడ్జికి కవిప్రియ తీసుకెళ్లి స్పృహ కోల్పోయేలా చేసి అతడి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బును దోచుకుని ఉడాయించడం తెలిసిందే. ఫిర్యాదు రాగా, ఇందిరానగర పోలీసులు గాలించి సోమవారం కవిప్రియ, హర్షవర్ధన్‌ను అరెస్ట్ చేశారు.
క్యాబ్‌పై ఉన్మాది హల్‌చల్
● కట్టేసి.. ఠాణాకు తరలింపు
యశవంతపుర: క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తి కారు పైకెక్కి హల్‌చల్ చేసిన ఘటన బెంగళూరు మేక్రి సర్కిల్‌లో జరిగింది. సూపర్ మార్కెట్‌లో మేనేజర్‌గా పని చేసే సంతోష్ బద్రీనాథ్ మైసూరు నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో బయల్దేరాడు. మేక్రి సర్కిల్‌లో క్యాబ్ డ్రైవర్‌తో గొడవకు దిగాడు. ట్రాఫిక్ జామ్ కారణంగా కారు నెమ్మదిగా వెళ్తుండగా అతడు కారు దిగేసి బాయ్‌నెట్ మీద ఎక్కాడు. చిందులు వేయసాగాడు. ట్రాఫిక్ పోలీసులు సంతోష్‌ను సముదాయించగా వారిపై కూడా దాడి చేశారు. పోలీసులు అతడిని కాళ్లు, చేతులు కట్టేసి రోడ్డుపై పడుకోబెట్టారు. సంతోష్ ఆరు నెలల నుంచి ఉద్యోగాన్ని కోల్పోయి, భార్యతో గొడవపడి ఇలా మారినట్లు తెలిసింది.
అడవిని వదిలిన 20 పులులు


