బెంగళూరు టు తుమకూరుకు మెట్రో రైలు
● ప్రాజెక్టు నివేదికకు ఆహ్వానం
శివాజీనగర: బెంగళూరుకే పరిమితమైన నమ్మ మెట్రో రైలు తుమకూరు నగరం వరకు పరుగులు తీసే అవకాశముంది. రెండు నగరాలను కలిపేలా బీఎంఆర్‌సీఎల్ 59.6 కి.మీ పొడవైన ప్రాజెక్టుకు సవివర పథక నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసేందుకు బిడ్‌లను ఆహ్వానించింది. పీపీపీ తరహాలో రూ. 20,649 కోట్ల ఖర్చుతో నిర్మాణం కావచ్చని అంచనా వేశారు. బిడ్‌లు దాఖలుకు ఈ నెల 20 వరకు గడువు ఇవ్వగా, నవంబర్ 21న టెండర్ ఓపెన్ చేసే అవకాశముంది. ఐదు నెలల్లో నివేదికను తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
26 ఎలివేటెడ్ స్టేషన్లు
మాదావర (బీఐఇసీ) నుంచి తుమకూరు నగరానికి మార్గం నిర్మాణం కావచ్చు. నెలమంగల, దాబస్‌పేట, క్యాతసంద్ర, శిర తదితరాల మీదుగా వెళ్తుంది. కనీసం 26 మెట్రో స్టేషన్లు, అన్నీ ఎలివేటెడ్ స్థాయిలో ఏర్పాటు అవుతాయని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ఈ మార్గంలో ప్రతి గంటకు సుమారు 15 వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు.
ఫ్లాటులోకి చొరబడి హత్య
బొమ్మనహళ్లి: భర్త నుంచి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళను కొడవళ్లతో నరికి చంపారు. బెంగళూరు బొమ్మనహళ్ళి పరిధిలోని హోంగసంద్రలో ఉన్న మునిరెడ్డి లేఔట్‌లోని ఓ అపార్ట్‌మెంటులో ఈ సంఘటన జరిగింది. ప్రమోద (35) హతురాలు. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా శిరసికి చెందిన ప్రమోద హోంగసంద్రలో గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆమె తన సోదరి భర్త అయిన సురేష్‌ను పెళ్ళిచేసుకొంది. కూతురు, కొడుకు ఉన్నారు. అయితే భర్తతో గొడవలు వచ్చి ఇక్కడకు వచ్చి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లాటులో ఉన్న ఆమెను కొందరు దుండగులు చొరబడి హత్య చేసి పరారయ్యారు. బొమ్మనహళ్ళి పోలీసులు విచారణ చేపట్టారు.
టిప్పర్ ఢీ.. యువతి మృతి
దొడ్డబళ్లాపురం: స్కూటర్‌ను టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతిచెందిన సంఘటన బెంగళూరు–హైదరాబాద్ రహదారి మార్గంలోని రాణిక్రాస్ వద్ద జరిగింది. అనిత (20) అనే యువతి మరణించగా, స్కూటర్ వెనుక కూర్చున్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఏపీవాసులని తెలిసింది. దేవనహళ్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని టిప్పర్ డ్రైవర్‌ని అరెస్టు చేశారు.
బెంగళూరు టు తుమకూరుకు మెట్రో రైలు


