కోత కోసిన వరి పైరు చోరీ
హొసపేటె: హిట్నాళ్ గ్రామంలో ఒక రైతు కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన వరి పంటను కోత కోసిన తరువాత దొంగలు ఆదివారం రాత్రి వాహనాల్లో తరలించిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. హిట్నాళ్ గ్రామానికి చెందిన యమునూరప్ప మజ్జిగి అనే రైతు తన పొలానికి సమీపంలో ఉన్న అర ఎకరం భూమిని కౌలుకు తీసుకుని వరి నాటాడు. కోతకు సిద్ధంగా ఉన్న వరి మంచి దిగుబడిని ఇస్తుందని భావించాడు. ఆదివారం సాయంత్రం నాటికి పంట పొలంలో సురక్షితంగా ఉంది. అయితే సోమవారం ఉదయం యమునూరప్ప ఎప్పటిలానే పొలానికి వచ్చి చూసేసరికి వరి పంటలో మూడొంతులు పూర్తిగా కోతకు గురయ్యాయి. పొలంలో వరి ఖాళీగా ఉంది. రాత్రి వేళ కొడవలితో కోసిన వరి ధాన్యం కంకులను దొంగలు వాహనాల్లో తరలించారు. ఈ విషయంపై బాధితుడు తనకు న్యాయం చేయాలని కొప్పళ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


