రైతుల పాదయాత్ర ముగింపు
సాక్షి,బళ్లారి/హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సాగు నీరందించే తుంగభద్ర జలాశయం నుంచి రబీ సీజన్‌లో రెండో పంటకు నీరందించాలనే డిమాండ్‌తో రైతులు చేపడుతున్న పాదయాత్ర ముగిసింది. 6 రోజుల క్రితం సిరుగుప్ప తాలూకా కరూరు నుంచి మొదలైన రైతుల పాదయాత్ర సిరుగుప్ప, కంప్లి, హొసపేటె తాలూకాల మీదుగా వందలాది మంది రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తుంగభద్ర డ్యాంకు సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. కర్ణాటక ప్రాంత రైతుల సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, సీనియర్ న్యాయవాది మల్లికార్జున రెడ్డి నేతృత్వంలో కొనసాగిన ఈ పాదయాత్ర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాటు డ్యాం వద్ద రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. తుంగభద్ర డ్యాం నుంచి రైతులకు రెండో పంటకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
నీరు ఉన్నా ఇవ్వకపోవడం తగదు
సంఘం నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో తగినంత నీరు ఉన్నా గేట్లు మార్చాలనే సాకుతో రెండో పంటకు నీరివ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పడం సరి కాదన్నారు. గేట్లు మార్చడానికి, రెండో పంటకు నీరివ్వడానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా రెండో పంటకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవగాహన లేని పాలకులు ఉండటం వల్ల రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. రైతుల సమస్యలను అర్థం చేసుకొని రెండవ పంటకు నీరు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారి ఆర్.రామకృష్ణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యాంలో నీటి నిల్వ, గేట్ల మార్పిడి తదితర సమస్యలతో రెండో పంటకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చిన నేపథ్యంలో రైతులు ఆందోళన చేపడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సూచించారు. రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తుంగభద్ర డ్యాం వద్ద రైతుల బైఠాయింపు
రెండో పంటకు నీరు ఇవ్వాలని రైతుల వినతి
రైతుల పాదయాత్ర ముగింపు


