మిర్చి రైతుకు కాస్త ఊరట
సాక్షి, బళ్లారి: మూడేళ్లుగా మిర్చి ధర పతనమవడంతో నష్టపోయిన రైతుకు ఈ ఏడాది కాస్త ఊరట లభి స్తోంది. క్రమేణా ధర పెరుగుతుండడంతో ఇన్నాళ్లూ కోల్ట్ స్టోరేజీల్లో దాచి ఉంచిన రైతులు తమ మిర్చి దిగుబడులను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప, బళ్లారి, కంప్లి, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో వేలాది మంది రైతులు లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట సాగుచేస్తారు. గత మూడేళ్లుగా పంట నష్టం చవిచూసిన రైతులు వచ్చిన కాస్త దిగుబడులను ధరలేక కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్నారు. మూడేళ్లుగా కేవలం రూ.6 వేల నుంచి రూ.15 వేల లోపు పలికిన మిర్చి ధర గత 15 రోజుల్లో పెరుగుతూ వస్తోంది. నాణ్యతను బట్టి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధర లభిస్తుండడంతో రైతులు ఊరట చెందుతున్నారు.
దిగుబడుల తరలింపు
గత మూడేళ్లలో వచ్చిన దిగుబడులకు ధర లేక రైతులు వేల రూపాయలు బాడుగ చెల్లించి కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్నారు. ధర భారీగా పతనమవడంతో కోల్డ్ స్టోరేజీ యజమానులకు బాడుగ కట్టేందుకు ఇబ్బంది పడ్డారు. ఎప్పుడెప్పుడు ఎండు మిర్చి ధర పెరుగుతుందా? అని ఎదురు చూశారు. తాజాగా ధర పెరగడంతో ఎండు మిర్చి సంచులను మార్కెట్‌కు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించడంతో వ్యాపారులు కూడా అదేసంఖ్యలో వచ్చి కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ధరలు పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు రైతులకు ఊరట లభిస్తోంది.
ఈ ఏడాది తక్కువ సాగు
ఎండుమిర్చి, పచ్చి మిర్చి ధరలు పెరుగుతున్న సందర్భంగా ప్రస్తుతం సాగుచేసిన మిర్చి రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. తుంగభద్ర ఆయకట్టు కింద వరి తర్వాత అత్యంత ఎక్కువగా సాగు చేసే ఏకై క పంట మిర్చి. అయితే ధరలు పతనమవడంతో ఈ ఏడాది తక్కువగా సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు పరిధిలో కోత దశకు చేరుకుంటున్న మిర్చి పంట దిగుబడులను వెంటనే అమ్మేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎండు మిర్చితోపాటు పచ్చిమిరప కాయల ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
మిర్చి ధర కాస్త పెరిగింది
మిర్చి ధరలు కాస్త పెరిగాయి. మూడేళ్లుగా కోల్డ్ స్టోరేజీల్లో దాచిన సంచులకు బాడుగ కట్టేందుకు ఇబ్బంది పడ్డాం. 15 రోజులుగా ధరలు పెరుగుతుండడంతో లాభాల మాట అటుంచితే కనీసం పెట్టుబడులైనా దక్కుతాయనే ఆశ ఉంది. గత ఏడాది 25 ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ ఏడాది పది ఎకరాల్లో పంట వేశా. చాలామంది రైతులు ఈ ఏడాది పంట సాగు చేయలేదు. వ్యాపారులు దగా చేయకుండా రైతులకు మేలు చేయాలి.
– ఎర్రిస్వామి, మిర్చి రైతు
15 రోజుల్లో పెరిగిన ఎండు మిర్చి ధర
కోల్డ్ స్టోరేజీల నుంచి కదులుతున్న సంచులు


