హుబ్లీలో నిందితులపై కాల్పులు
హుబ్లీ: వాణిజ్య నగరం హుబ్లీలో నిందితులు తప్పించుకొని పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. వివరాలివీ... గురువారం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు కీలక నిందితులపై ఈ కాల్పులు జరిపారు. ఈ నెల 13న మంట్టూరు రోడ్డు బ్యాలీఫ్లాట్ వద్ద పాత పగల నేపథ్యంలో మలీక్‌జాన్ అహ్మద్ (25) అనే యువకుడిని సెట్లిమెంట్ గ్యాంగ్ చాకుతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి బెణ్ణిగేరి పోలీసులు ముగ్గురు నిందితులను గతంలో అరెస్టు చేశారు.
విచారణకు తీసుకెళ్తుండగా...
కేసులో ఇతర కీలక నిందితులను చూపాలని అరెస్టయిన బాలరాజ్, మహమ్మద్‌షేక్‌లను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో సిబ్బందిపై నిందితులు రాళ్లు విసిరి తప్పించు కోవడానికి ప్రయత్నించారు. బెండిగేరి పోలీస్‌స్టేషన్ సీఐ ఎస్‌ఆర్ నాయక్, పోలీసుల బృందం వారి కాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ఇద్దరూ అక్కడే కుప్పకూలారు. పోలీసులపై నిందితులు రాళ్లు వేయడంతో పలువురికీ గాయాలయ్యాయి. వారిని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ మలిక్ జాన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా నిందితులతో ఘటనా స్థలంలో విచారించే క్రమంలో తమ సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దీంతో సీఐ నాయక్, ఇతర సిబ్బంది నిందితులపై ఫైరింగ్ చేశారన్నారు. ఆ ఇద్దరు నిందితుల కుడి కాళ్లలోకి తుపాకి గుండ్లు దూసుకెళ్లాయని, వారికి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారన్నారు. డీసీపీలు మహనింగనందగావి, సీఆర్.రవి, తదితరులు పాల్గొన్నారు.
హుబ్లీలో నిందితులపై కాల్పులు


