కాల్వలకు నీటి విడుదల కష్టమే..!
రాయచూరురూరల్: అలమట్టి జలాశయం నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయడం కష్టసాధ్యమని ఎకై ్సజ్ శాఖా మంత్రి అర్‌బి.తిమ్మాపూర్ ప్రకటించారు. అలమట్టి డ్యాం అతిథి భవన్‌లో జరిగిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్తర కర్నాటకలోని బాగల్‌కోట, విజయపుర, కళ్యాణ కర్నాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల శాసన సభ్యులు ఒత్తిడి చేయడంతో ఖరీఫ్‌కు నీటిని విడుదల చేశామని తెలిపారు. జలాశయంలో 62 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. డిసెంబరు నాలుగో తేదీ వరకు కాల్వలకు నీరు వదలడానికి నీటిపారుదల సలహా సమితి అంగీకరించిందన్నారు. నారాయణపుర కుడి, ఎడమ కాల్వల పరిధిలోని అయుకట్టు చివరి భూములకు నీరు వదలాలని శాసన సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన పత్తి, కంది, వరి, మిరప పంటలకు నీరు లేక వాడు ముఖం పట్టాయని వివరించారు. మంత్రి స్పందిస్తూ రెండో పంటకు ఈ ఏడాది నీరు విడుదల చేయడం లేదన్నారు. 40 టీఎంసీల నీరు తాగునీటి కోసం ఉంచామని తెలిపారు. సభలో మంత్రులు శరణ బసప్ప, ప్రియాంఖఖర్గే, శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప పాల్గొన్నారు.


