అంతరగంగ జాతరకు ఏర్పాట్లు పూర్తి
కోలారు : దక్షిణకాశీగా ప్రఖ్యాతి గాంచిన నగర సమీపంలోని అంతరగంగ కాశీ విశ్వేశ్వరస్వామి సన్నిధిలో చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భజరంగ దళ్, విశ్వహిందూ పరిషత్, హిందూపర సంఘటనల కార్యకర్తలు ఆదివారం నగరంలోని బస్టాండు సర్కల్ వద్ద బృహత్ స్వాగత ద్వారం, కేసరి బంటింగ్‌లు, ఫ్లెక్స్‌లు కట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జాతరను ప్రారంభించడానికి మాజీ ఎంపీ మునిస్వామి విశ్వ హిందూ పరిషత్, తదితర ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రధాన అర్చకుడు మంజునాథ్ దీక్షిత్ నేతృత్వంలో తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. దాతలు స్థానిక బస్టాండు సర్కిల్ నుంచి అంతరగంగ వరకు ఉచిత రాకపోకల సౌలభ్యాన్ని కల్పించారు. భక్తులకు ప్రసాదం, తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు.


