కారు ఢీకొని ఏనుగుకు గాయాలు
యశవంతపుర: రోడ్డు దాటుతున్న ఏనుగును కారు ఢీకొన్న ఘటన చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌పుర తాలూకా 9వ మైలు బుడగమనె గ్రామం వద్ద జరిగింది. చిక్క అగ్రహారం అటవీ ప్రాంతంలో రెండు అడవీ ఏనుగులు రోడ్డు దాటుతుండగా వేగంగా వెళుతున్న కారు ఓ ఏనుగును ఢీకొంది. దీంతో ఏనుగు అదుపుతప్పి కారుపై పడింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జుయింది. గాయమైన ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. వాహనదారుల ఇష్టానుసారం నడుపుతూ వన్యప్రాణులను గాయపరుస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మనుషులకు గాయమైతే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు, అడవిలోని ఏనుగులు గాయపడితే ఎవరు వైద్యం చేస్తారని ప్రశ్నించారు.
ఉసురు తీసిన అత్తయ్య కారు
దొడ్డబళ్లాపురం: మేనత్త కారు కింద పడి చిన్నారి బాలిక మరణించిన సంఘటన బెంగళూరు మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. తోటదగుడ్డ బెనక లేఔట్‌లో మోహన్ అనే వ్యక్తి కూతురు నూతన (1) మృతురాలు. శనివారంనాడు మోహన్ అక్క, బావ కారులో ఇంటికి వచ్చారు. తిరిగి వెళ్లేటప్పుడు డ్రైవర్ కారును రివర్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో బాలిక కారు వెనుక ఆడుకుంటోంది. దీంతో కారు చక్రాల కింద చిక్కుకున్న నూతన అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఆకస్మిక దుర్ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్నారు.
నేటి నుంచి శెనక్కాయల పరుస
బనశంకరి: ప్రతి ఏటా కార్తీక మాసం చివరి సోమవారం నిర్వహించే బసవనగుడి దొడ్డబసవణ్ణ శనక్కాయల పరుస సోమవారం నుంచి ఐదురోజుల పాటు జరగనుంది. దొడ్డ బసవణ్ణ, దొడ్డ గణపతి ఆలయాలు, బుల్‌టెంపుల్ రోడ్డును విద్యుత్ దీపాలంకరణ చేశారు. బుల్ టెంపుల్ రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర వ్యాపారులు శనక్కాయల రాశులను ఏర్పాటుచేశారు. భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దొడ్డ బసవణ్ణ దర్శనానికి కల్పించారు. పేదల బాదామిగా పేరుపొందిన వివిధ రకాల రకాల శనక్కాయలు నగరవాసులను నోరూరిస్తున్నాయి. వేయించిన, ఉడికించిన శెనక్కాయలు, శెనక్కాయల మిఠాయిలు విక్రయిస్తున్నారు. పిల్లలు, మహిళల కోసం వివిధ వస్తు సామగ్రి దుకాణాలు వెలిశాయి.
కాలేజీలో కాముక లెక్చరర్
మైసూరు: మైసూరు నగరంలో ప్రసిద్ధి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో కాముక లెక్చరర్ ఓ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేశారు. నీకు ఎక్కువ మార్కులు వేస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, బయటికి వెళ్దాం పబ్‌కు వెళ్ళి ఎంజాయ్ చేద్దామని ఆ యువతిని సతాయించేవాడు. ఇది భరించలేక ఆమె మైసూరు నగరంలోని జయలక్ష్మిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు భరత్ భార్గవ మీద ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు సార్ అని ఆమె ఒకసారి బుద్ధిమాటలు చెప్పగా, నాకే ఎదురుచెబుతావా అని మరింత రెచ్చిపోయి నిన్ను ఫెయిల్ చేస్తానని బెదిరించాడు.
తల్లి జ్ఞాపకాలతో కొడుకు ఆత్మహత్య
మండ్య: కొన్ని నెలల క్రితం తల్లి చనిపోవడంతో తట్టుకోలేక కుమారుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండ్య జిల్లాలో హలగూరు దగ్గర దేవీరహళ్ళి చెరువులో జరిగింది. వివరాలు.. చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని బండళ్ళివాసి పరమశివమూర్తి కొడుకు నవీన్ (20), నవీన్ బెంగళూరు నగరంలో పని చేసుకునేవాడు, కొన్ని నెలల క్రితం తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అప్పటినుంచి తల్లిని తలచుకుని బాధపడుతున్నాడు. ఆదివారం సొంతూరికి వెళ్తూ, మార్గమధ్యలో దేవీరహళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసులను వేగంగా పరిష్కరించాలి
రాయచూరురూరల్: క్షణికావేశంలో చేసిన తప్పులతో శిక్ష అనుభవిస్తున్న కక్షి దారుల కేసులను వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విబూ బఖ్రు పిలుపునిచ్చారు. దేవదుర్గలో నూతన కోర్టువనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.


