చిత్తాపురలో నెగ్గిన ఆర్‌ఎస్‌ఎస్ పంతం
శివాజీనగర: రాష్ట్రస్థాయిలో భారీ చర్చకు కారణమైన కల్బుర్గి జిల్లా చిత్తాపుర పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ కవాతు ఎట్టకేలకు ఆదివారం జరిగింది. కోర్టు ఆమోదముద్రతో సంఘ్ ప్రముఖులు, పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగింది. గత నెల రోజుల నుంచి జిల్లాకు చెందిన మంత్రి ప్రియాంక్ ఖర్గే.. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని లేఖలు రాయడం, చిత్తాపురలో కవాతుకు అనుమతి రాకుండా అడ్డుకోవడంతో ఈ విషయం వేడెక్కింది. చివరకు హైకోర్టుకు చేరింది. ర్యాలీ చేయడానికి ఏకసభ్య, ద్విసభ్య ధర్మాసనాలు అనుమతించడంతో ఖర్గేకు ఎదురుదెబ్బ తగిలింది.
ఉదయమే బజాజ్ కళ్యాణ మండపం నుంచి ఆరంభమైన పథసంచలనం వివిధ కూడళ్ల గుండా సాగుతూ మధ్యాహ్నం 3:45 గంటల వరకు జరిగింది. 300 మంది కార్యకర్తలు, 50 బ్యాండ్ వాదకులు పాల్గొన్నారు. ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి వీక్షించారు. జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు చిత్తాపురలోనే మకాం వేశారు. 650 మంది పోలీసులు, 250 మంది హోం గార్డులతో బందోబస్తు ఏర్పడింది.
ఆర్‌ఎస్‌ఎస్ అక్రమాలను
బయటపెడతా: మంత్రి ఖర్గే
యశవంతపుర: ఆర్‌ఎస్‌ఎస్ మోసాలను సాక్ష్యాధారాలతో బయటపెడతానని ఐటీ, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఆయన ఆదివారం కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ కవాతును తాను వ్యతిరేకించలేదన్నారు. అనుమతులు తీసుకొని మాత్రమే నిర్వహించాలని చెప్పానన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌చే జరిగిన అనేక మోసాలు, కేకేఆర్‌డిబి అక్రమాలను త్వరలోనే బహిరంగం చేస్తానన్నారు.
విజయవంతంగా పథసంచలనం


