పాఠశాలల్లో ధన్వంతరి తోటల నిర్మాణం
కోలారు : జిల్లాలోని 150 ప్రభుత్వ పాఠశాలల్లో ధన్వంతరి తోటల నిర్మాణం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి తెలిపారు. వసతి నిలయాల్లో ధన్వంతరి వనం నిర్మించడంపై శనివారం జిల్లా సభాంగణంలో ఏర్పాటు చేసిన కార్యాగారాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో పౌష్టిక తోట అనే కార్యక్రమాన్ని అమలు చేయడానికి సుమారు 150 పాఠశాలలు, 45 వసతి నిలయాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 20 గుంట్ల నుంచి అర ఎకరా స్థలంలో వివిధ రకాల ఆయర్వేద మొక్కలను నాటి పోషించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మొక్క వద్ద నామఫలకం ఏర్పాటు చేసి దాని విశిష్టత తెలియజేస్తామన్నారు. ఉపాధిహామీ పథకం నిధులు ఈ పనులకు వినియోగిస్తామన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి, ఎస్పీ నిఖిల్, డిప్యూటీ కలెక్టర్ మంగల తదితరులు పాల్గొన్నారు.


