రెండో పంటకు నీరివ్వకుంటే పోరాటమే | - | Sakshi
Sakshi News home page

రెండో పంటకు నీరివ్వకుంటే పోరాటమే

Nov 16 2025 10:27 AM | Updated on Nov 16 2025 10:27 AM

రెండో

రెండో పంటకు నీరివ్వకుంటే పోరాటమే

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోక పోవడంతో రైతన్నలు పూర్తిగా నష్టపోయి అప్పులు పాలు అవుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే తుంగభద్ర జలాశయం నుంచి రెండవ పంటకు నీరు ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో శనివారం బెంగళూరులోని జగన్నాథపురలోని బీజేపీ కార్యాలయంలో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని నాలుగు జిల్లాలకు చెందిన బీజేపీ నేతల సమక్షంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకుడు అశోక్‌, మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ముక్తకంఠంతో మాట్లాడుతూ ఆయకట్టు రైతుల పొలాలకు రబీ సీజన్‌లో నీరు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు.

నీరున్నా క్రాప్‌ హాలిడే ప్రకటన తగదు

డ్యాంలోని 33 గేట్లను మార్చాలన్న సాకుతో డ్యాంలో రబీ పంటకు తగినంత నీరు ఉన్నా క్రాప్‌ హాలిడే ప్రకటించడం సరైన చర్య కాదన్నారు. లక్షలాది ఎకరాలను బీడు భూమిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై తాము పోరాటం చేస్తామన్నారు. గత ఏడాది డ్యాంలో క్రస్ట్‌గేట్‌ కొట్టుకుపోయిన నేపథ్యంలో ఒక ఏడాది గడిచి పోయినా ఎందుకు డ్యాం గేట్లను మార్చలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రబీ పంటకు నీరు ఇవ్వకుండా డ్యాం గేట్లను మార్చాల్సిన అవసరం లేదని, పంట ముగిసిన తర్వాత గేట్లను మార్చవచ్చని అన్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆయకట్టు రైతులకు రబీ సీజన్‌కు నీరు ఇవ్వకపోతే ఒక ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అలా ప్రకటించక పోతే తాము ఈ నెల 25వ తేదీ నుంచి తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని అన్ని తాలూకాల్లోని గ్రామాల్లో రైతుల సమక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌.దివాకర్‌, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా బీజేపీ అధ్యక్షులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర, అశోక్‌, శ్రీరాములు తదితరులు

హాజరైన నాలుగు జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు, ఆయట్టు రైతులు

ఎకరాకు రూ.25 వేల చొప్పున

పరిహారం ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలింది

కాంగ్రెస్‌ సర్కారుపై విపక్ష నేతలు ధ్వజం

రెండో పంటకు నీరివ్వకుంటే పోరాటమే1
1/1

రెండో పంటకు నీరివ్వకుంటే పోరాటమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement