బళ్లారి మేయర్‌గా గాదెప్ప | - | Sakshi
Sakshi News home page

బళ్లారి మేయర్‌గా గాదెప్ప

Nov 16 2025 10:27 AM | Updated on Nov 16 2025 10:27 AM

బళ్లారి మేయర్‌గా గాదెప్ప

బళ్లారి మేయర్‌గా గాదెప్ప

సాక్షి బళ్లారి: ఉత్కంఠభరితంగా కొనసాగిన నగర మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికల్లో ఎట్టకేలకు నగర మేయర్‌గా 23వ వార్డు కార్పొరేటర్‌ పీ.గాదెప్ప ఎన్నికయ్యారు. ఉపమేయర్‌గా 28వ వార్డు కార్పొరేటర్‌ ముబీనా బీని ఎన్నుకొన్నారు. శనివారం నగర మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నిక కొనసాగిన నేపథ్యంలో నగర మేయర్‌గా ఎన్నిక కావడానికి ప్రభంజన్‌కుమార్‌, గాదెప్ప తీవ్రంగా పోటీ పడ్డారు. గత కొన్ని రోజులుగా మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు ప్రభంజన్‌ కుమార్‌ కార్పొరేటర్లు, నేతల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. శనివారం ఉదయం వరకు గాదెప్ప, ప్రభంజన్‌ కుమార్‌ల మధ్య మేయర్‌ పదవి దోబూచులాడింది. అయితే మేయర్‌ పదవికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున గాదెప్ప, ప్రభంజన్‌, ఆసిఫ్‌ నామినేషన్లు వేశారు. బీజేపీ తరపున కోనంకి తిలక్‌ మేయర్‌ పదవికి నామినేషన్‌ వేయగా ఉప మేయర్‌ పదవికి బీజేపీ తరఫున కల్పన నామినేషన్‌ వేశారు. అనంతరం సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించే లోపు తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

గాదెప్పకు ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతు

మేయర్‌గా గాదెప్పను ఎన్నుకోవాలని కార్పొరేటర్లకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భరత్‌రెడ్డి, నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసిర్‌ హుసేన్‌, పార్టీ పరిశీలకులు తదితరులు దిశానిర్దేశం చేశారు. అయితే ప్రభంజన్‌ కుమార్‌ కూడా నామినేషన్‌ వేయడంతో వెనక్కి తీసుకోవాలని నేతలు సూచించారు. బీజేపీ మద్దతుతో, పలువురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్ల మద్దతుతో ప్రభంజన్‌ కుమార్‌ మేయర్‌గా ఎన్నిక అవుతారని చర్చ సాగింది. అయితే నేతల సూచనతో ఎట్టకేలకు తన నామినేషన్‌ను ఉపసంహరించుకొన్న ప్రభంజన్‌ కుమార్‌ అనంతరం సిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో గాదెప్ప, తిలక్‌ల మధ్య ఎన్నిక జరగగా గాదెప్పకు 28 మంది మద్దతు తెలపగా, తిలక్‌కు కేవలం 13 మంది కార్పొరేటర్ల మద్దతు లభించింది. దీంతో ఎన్నికల అధికారి గాదెప్పను మేయర్‌గా, ఉప మేయర్‌గా ముబీనా బీ ఎన్నికై నట్లు ప్రకటించారు.

నగరాభివృద్ధికి పాటుపడతాం

అనంతరం నూతన పాలకులు మాట్లాడుతూ నగర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతామన్నారు. మేయర్‌ ఎన్నికపై ఎలాంటి గందరగోళం జరగలేదని, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన కార్పొరేటర్‌ గాదెప్పను మేయర్‌గా ఎంపిక చేశామని ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు అన్నారు. నూతన మేయర్‌ను ఎంపీ నాసిర్‌ హుస్సేన్‌, ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, నాగేంద్ర, పలువురు కార్పొరేటర్లు, ప్రముఖులు అభినందించారు.

ఉప మేయర్‌గా ముబీనా బీ

గాదెప్పకు 28 మంది కార్పొరేటర్లు

కోనంకి తిలక్‌కు 13 మంది మద్దతు

తటస్థంగా నిలిచిన ప్రభంజన్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement