ముగిసిన బిహార్ ఎన్నికలు.. రైలు ప్రయాణికులకు తిప్పలు
రాయచూరు రూరల్: ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే బిహారీలు తిరిగి బెంగళూరుకు ప్రయాణం చేశారు. దీంతో తీవ్రమైన రద్దీతో రైలు ప్రయాణికులకు నానా తిప్పలు ఎదుర్కోక తప్పలేదు. శుక్రవారం రాత్రి బిహార్ ప్రయాణికులు అధికంగా తిరుగు ప్రయాణాలు చేయడంతో రైలుల బోగీలు పూర్తిగా నిండిపోయి ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. దీంతో బోగీల్లో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణం చేశారు. బిహార్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన వారికి కిక్కిరిసిన రైలులో ప్రయాణించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక ఇచ్చారనే గుసగుసలు వినిపించాయి. లాతూర్ నుంచి బెంగళూరు వరకు బీదర్– యశ్వంతపూర్ రైలులో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు ప్రయాణం చేస్తున్నారు. అదనపు రైళ్లను నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదనపు బోగీలను అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ముగిసిన బిహార్ ఎన్నికలు.. రైలు ప్రయాణికులకు తిప్పలు


