కిరాతక తండ్రికి జీవితఖైదు
హోసూరు: కొడుకు కొత్త కోడల్ని ఆశీర్వదించి ఆదరించాల్సిన తండ్రి కులం మత్తులో కిరాతకునిగా మారాడు. వేరే కులం అమ్మాయిని ప్రేమించి తాళి కట్టాడని ఉన్మాదిగా మారి కొడుకును, అడ్డొచ్చిన తల్లిని హత్య చేసిన హంతకునికి జీవిత జైలుశిక్ష విధిస్తూ క్రిష్ణగిరి కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని అరుణపతి గ్రామానికి చెందిన దండపాణి కొడుకు సుభాష్ (28) తిరుపత్తూరులోని ప్రైవేట్ కంపెనీలో కార్మికునిగా పనిచేసేవాడు. 2023 మే నెలలో అదే పరిశ్రమలో పనిచేస్తున్న వేరే కులానికి చెందిన అనసూయ(25)ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. దీనిని ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు.
నానమ్మ పిలిపించగా..
దండపాణి తల్లి కణ్ణమ్మ (68) నూతన దంపతులను సమాధానపరిచి స్వగ్రామానికి పిలిపించుకొంది. ఆ సమయంలో ఆవేశానికి గురైన దండపాణి ఇంట్లో నింద్రిస్తున్న సుభాష్‌పై దాడి చేసి హత్య చేశాడు. అడ్డొచ్చిన తల్లి కణ్ణమ్మను నరికి చంపాడు. అనసూయపై దాడి చేయగా తీవ్ర గాయాలతో తప్పించుకుంది. ఈ పరువు హత్య రాష్ట్రంతో పాటు దేశమంతటా చర్చనీయాంశమైంది. కిరాతకున్ని తక్షణం శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఊత్తంగేరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు క్రిష్ణగిరి కోర్టులో జరుగుతూ వచ్చింది. శుక్రవారం కేసును విచారణ జరిపిన న్యాయమూర్తి రమేష్.. నేరం రుజువు కావడంతో హంతకునికి జీవితఖైదు శిక్షతో పాటు రూ. 8 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


