పిల్లలకు నాణ్యమైన విద్యను అందించండి
కోలారు : పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని
నివృత్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే అన్నారు. శనివారం శ్రీనివాసపురం తాలూకాలోని చల్దిగానహళ్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అభ్యసన పరికరాలను అందించి మాట్లాడారు. గతంలో సమాజంలో తప్పులు చేసిన వారిని దండించే వారన్నారు. ఉత్తమ పనులు చేసే వారిని సన్మానం చేసేవారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వారిని చెడ్డవారుగా చూసి దూరంగా ఉంచేవారు. అయితే నేడు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిని ఊరేగింపుగా తీసుకు వచ్చి సన్మానాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పిల్లలకు ఆస్తుల కంటే విద్యనే అందించాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నటరాజ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్‌లకు బానిసలు చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శివ ప్రకాష్, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


