రబీ సీజన్‌కు నీరు ఇవ్వలేం | - | Sakshi
Sakshi News home page

రబీ సీజన్‌కు నీరు ఇవ్వలేం

Nov 15 2025 7:45 AM | Updated on Nov 15 2025 7:45 AM

రబీ సీజన్‌కు నీరు ఇవ్వలేం

రబీ సీజన్‌కు నీరు ఇవ్వలేం

సాక్షి బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాలకు సాగు, తాగు నీరందించే ఉమ్మడి జలాశయమైన తుంగభద్ర డ్యాం నుంచి ఆయకట్టు రైతులకు రబీ సీజన్‌ రెండవ పంటకు నీరు ఇవ్వలేమని నేతలు తేల్చిచెప్పారు. శుక్రవారం బెంగళూరు విధానసౌధలో తుంగభద్ర బోర్డు నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌, తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి అధ్యక్షుడు, మంత్రి శివరాజ్‌ తంగడిగి, మరో మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు గాలి జనార్థన్‌రెడ్డి, బీ.నాగేంద్ర, బీఎం నాగరాజు, రైతు సంఘం నేతలు దరూరు పురుషోత్తంగౌడ తదితరులు పాల్గొన్న ఐసీసీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌, నీటిపారుదల సలహా సమితి అధ్యక్షుడు, మంత్రి శివరాజ్‌ తంగడిగి కీలక నిర్ణయం తీసుకొన్నారు.

రైతులతో సుదీర్ఘంగా చర్చలు

సమావేశంలో రైతు సంఘం నేతలు, ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. డ్యాం గేట్లలో అన్ని 33 మార్చాలని నిపుణులు సూచించిన నేపథ్యంలో గేట్లు మార్చడానికి ఆరు నెలల కాలావధి పడుతుందన్నారు. ఈనేపథ్యంలో డిసెంబర్‌ 26 నుంచి జూన్‌ 26వ తేదీ వరకు డ్యాంకు ఉన్న అన్ని గేట్లను మార్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు అర్థం చేసుకొని రెండవ పంట విషయంలో రాజకీయాలకు తావు లేకుండా అందరూ సహకరించాలని కోరారు. రబీ సీజన్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటిస్తేనే గేట్లు మార్చేందుకు సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రస్తుతం డ్యాంలో కూడా 75 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన అన్ని పంటలను పూర్తి స్థాయిలో రైతులకు చేతికి అందే విధంగా జనవరి 10 వరకు హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ కాలువలకు నీటిని విడుదల చేస్తామన్నారు.

రైతులు నష్టపోకుండా చూస్తాం

ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, మిర్చి, పత్తి తదితర అన్ని పంటలకు నీరు అందించి రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. అయితే గేట్లు మార్చాలనే సాకుతో రబీకి క్రాప్‌ హాలిడే ప్రకటించడం లేదని డ్యాంలో గరిష్ఠ నీటి నిల్వ, నిపుణుల సూచనల మేరకు భవిష్యత్తు దృష్ట్యా గేట్లను పూర్తిగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామన్నారు. రైతులు ఈ విషయంలో పాదయాత్రలు, ఆందోళనలు, బెంగళూరులో సమావేశాలు వంటి రాజకీయాలు చేయకూడదని ప్రతిపక్ష నేతలకు, రైతు సంఘం నాయకులకు సూచించారు. డ్యాంకు ఉన్న 33 గేట్లను నూతనంగా తయారు చేయించే పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. ఖచ్చితంగా అన్ని గేట్లను మార్చేందుకు రబీకి క్రాప్‌ హాలిడేను ప్రకటిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

తాగునీటికి ఇబ్బంది ఉండదు

తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా డ్యాంలో నీటిని నిల్వ ఉంచుకొని అవసరమైన మేరకు ఉపయోగిస్తామన్నారు. రబీకి క్రాప్‌ హాలిడే విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను కూడా ఒప్పించామన్నారు. ఈ ప్రాంత రైతులు కూడా అర్థం చేసుకోవాలన్నారు. మొత్తం మీద ఐసీసీ సమావేశంలో రబీకి నీరు ఇస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఓ వైపు రబీకి నీరు ఇవ్వాలని రైతు సంఘం నాయకులు పాదయాత్రలు చేస్తున్న తరుణంలో రబీకి క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఇక ఆయకట్టు రైతుల, ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేల నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

రెండవ పంట లేదు, క్రాప్‌ హాలిడే అని తేల్చేసిన వైనం

జనవరి 10 వరకు అన్ని కాలువలకు నీరు విడుదల చేస్తాం

డిసెంబర్‌ 26 నుంచి జూన్‌ 26 వరకు గేట్లు మార్పు చేస్తాం

రైతులకు నీరిచ్చే విషయంలో

రాజకీయాలు చేయవద్దని హితవు

నీటిపారుదల సమితి సమావేశంలో పాలకుల కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement