వైద్యుల కోసం రోగుల ఎదురు చూపు
● ఆస్పత్రిలో సకాలంలో అందని వైద్యం
● చికిత్స చేయకుండా డాక్టర్ల నిర్లక్ష్యం
హొసపేటె: వైద్యులు పని వేళల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని 100 పడకల ఆస్పత్రిలో జరిగింది. ఉదయం 11 గంటలకు లేదా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు, నర్సుల పని వేళలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటాయి. అయితే ఆస్పత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడు భరత్ తన విధి నిర్వహణ సమయంలో రోగులను ఐదు నిమిషాలు వేచి ఉండమని చెప్పి వెళ్లి మధ్యాహ్నం 3.39 గంటలకు తిరిగి విధుల్లోకి చేరాడు. ఉదయం నుంచి చికిత్స కోసం వేచి ఉన్న రోగులు కోపోద్రేకంతో వైద్యుడు చూపిన నిర్లక్ష్యంపై డ్యూటీ వైద్యుడు డాక్టర్ భరత్, నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హొసపేటెలోని 100 పడకల ఆస్పత్రికి ప్రతి రోజూ వేలాది మంది పేద రోగులు చికిత్స కోసం వస్తారు. అయితే విధుల్లో ఉండాల్సిన వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో రాత్రి డ్యూటీ చేసి, పగటి పూట ఆస్పత్రిలో నిద్ర పోతే రోగుల పరిస్థితి ఏమిటి? అని రోగులు ప్రశ్నిస్తున్నారు.
వైద్యుల కోసం రోగుల ఎదురు చూపు


