బళ్లారి రూరల్ : దావణగెరె కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓల్వో ఫ్లైబస్సు సౌకర్యాన్ని బుధవారం దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున ప్రారంభించారు. ఈ బస్సు దావణగెరెలో ఉదయం 10 గంటలకు బయలుదేరి చిత్రదుర్గ, తుమకూరు, దాబస్‌పేటె మార్గంలో సంచరించి మధ్యాహ్నం 1 గంటకు కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకొంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరో బస్సు దావణగెరె నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు దేవనహళ్లి సమీపంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి 12.45 గంటలకు కెంపేగౌడ విమానాశ్రయం వద్ద నుంచి బయలుదేరి అదేమార్గంలో తెల్లవారు జామున 3 గంటలకు దావణగెరెకు చేరుకొంటుందని తెలిపారు. విమానాశ్రయం నుంచి తుమకూరుకు రూ.400 చిత్రదుర్గకు రూ.980, దావణగెరెకు రూ.1250లను టికెట్ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.
నేడు వృద్ధాశ్రమంలో
ఇస్కాన్ గృహ సంకీర్తన
హుబ్లీ: నవనగర్‌లోని వివేకానంద వృద్ధాశ్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గృహ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వృద్ధాశ్రమ సూపరింటెండెంట్ రుద్రయ్య మడివాళయ్య చరంతిమఠ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే పూజలలో తులసి బృందావనం, రాధా కృష్ణులకు విశేషంగా పూజలు జరిపి భజనలు, సంకీర్తనలు, గాయనాలతో తబలా, తాళాలు వాయిద్యాలతో పూజా కార్యక్రమాలను నెరవేరుస్తున్నట్లు రాయాపుర ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు కృష్ణ భక్తదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా రాధాకృష్ణులకు పూజలు, తులసి బృందావనానికి విశేష పూజా కార్యక్రమాలు నెరవేరాక శ్రీమద్ భాగవతం, భగవద్గీత సంకీర్తన జరుగుతుంది. అనంతరం పూజల్లో పాల్గొనే అవ్వా, తాతలకు, ఇరుగుపొరుగు వారికి కూడా ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు.
పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని బాలేనహళ్లి గ్రామ సమీపంలోని ఇందిరాగాంధీ వసతియుత పాఠశాలకు ఎమ్మెల్యే టి.రఘుమూర్తి వెళ్లి ఆకస్మిక పరిశీలన చేశారు. అక్కడ విద్యార్థులను కలిసి స్వయంగా మాట్లాడి అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా ఆహార పదార్థాల శుభ్రత, నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈసందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థుల భద్రతపై శ్రద్ధ తీసుకోండి
చెళ్లకెరె రూరల్: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల యోగక్షేమాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీపీ ఈఓ శశిధర్ హెచ్చరించారు. ఆయన నగరంలోని టీపీ సభాంగణంలో ఏర్పాటు చేసిన సామాన్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థి నిలయంలో విద్యార్థులు గైర్హాజరైతే అందుకు సిబ్బంది వర్గమే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూసుకోవాలన్నారు. తాలూకాలో తక్కువ వర్షపాతం నమోదు అయినందున అధికారులను పంటలను సమీక్షించి రైతులను ఆదుకొనేలా వాస్తవ గణాంకాలను ప్రభుత్వం దృష్టికి నివేదిక రూపంలో అందించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. ఈసందర్భంగా టీపీ అధికారి మంజునాథ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
యథేచ్ఛగా చెట్ల నరికివేత
కోలారు : బంగారుపేట పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ యార్డులో పెరిగిన భారీ చెట్ల కొమ్మలను అధికారులు నరికివేయించారు. అయితే అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా చెట్టుకొమ్మలు నరకడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. దీనిపై మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ చెట్టు కొమ్మల వల్ల భవనానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో కొమ్మలను నరికి వేయించామన్నారు. అటవీశాఖ వలయ అరణ్య అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎలాంటి చెట్లు నరకాలన్నా అటవీశాఖ అనుమతి తప్పనిసరన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.
కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైబస్సు సౌకర్యం
కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైబస్సు సౌకర్యం


