వేళకు సరిగా బస్సులు నడపరూ
హొసపేటె: తాలూకాలోని కల్లహళ్లి గ్రామంలోని విద్యార్థులు సకాలంలో పాఠశాలలు, కళాశాలలకు చేరుకునేలా బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఏఐడీఎస్‌ఓ జిల్లా సభ్యురాలు ఉమా మాట్లాడుతూ కల్లహళ్లికి వచ్చే బస్సులు సకాలంలో రావడం లేదన్నారు. దీంతో ఆ గ్రామంలోని విద్యార్థులు, ప్రజలు ఇతర పట్టణాలు లేదా నగరాలకు ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకు బస్టాప్ దగ్గరకు వస్తే వారు ఉదయం 10 గంటలకు హొసపేటెకు చేరుతున్నారు. దీని వల్ల వారు కళాశాలలు, పాఠశాలకు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. దీంతో హాజరు, చదువులో సమస్యలు వస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రతి రోజు బస్సులను గ్రామాలకు సమయానికి సరిగా నడపాలని వారు డిమాండ్ చేశారు. వినతిపత్రం అందుకున్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కల్లహళ్లి గ్రామస్తులు భరమప్ప, విద్యార్థిని మంగళ, గ్రామ విద్యార్థులు పాల్గొన్నారు.


